ద్విచక్ర వాహనాల వేలం రేపు

5 Oct, 2016 23:13 IST|Sakshi
వేలం పాట నిర్వహించనున్న వాహనాలు ఇవే...

పాత శ్రీకాకుళం : పోలీసుస్టేషన్లలో ఏళ్ల తరబడి మూలుగుతున్న ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం ఎచ్చెర్లలోని ఆర్ముడు రిజర్వు పోలీస్‌ క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్లలో ఉన్న వందలాది వాహనాలకు ఒకేసారి వేలం వేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. వీటి వేలంకు అవసరమైన ఏర్పాట్లను శ్రీకాకుళం తహసీల్దార్‌ ఎస్‌.సుధాసాగర్‌ పూర్తి చేశారు. 

యమహా, బజాజ్, హీరో, హోండా, సుజుకి, టీవీఎస్‌ తదితర కంపెనీలకు చెందిన సుమారు 300 రకాల వాహనాలను బహిరంగ వేలం వేయనున్నారు. వీటిలో దొంగిలించిన వాహనాలు, రోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని కండిషన్‌లో ఉన్నా కొన్ని తుప్పు పట్టిపోయాయి. ఎటువంటి ప్రవేశ రుసుం లేకుండా వేలం పాటలో పాల్గొనవచ్చు.  అయితే వేలంలో ఈ వాహనాలను దక్కించుకునే వాటికి ఎటువంటి పత్రాల్లేవు. మరి వీటిని రోడ్డుపై తిప్పేందుకు ఎలా అనుమతిస్తారో వేచి చూడాలి.  


 వేలంపాట వరకే...
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలను శుక్రవారం వేలం వేయనున్నాం. వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఎటువంటి ప్రవేశ రుసుం లేదు. కాగితాలకు సంబంధించి పోలీసు, రవాణా శాఖాధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
–ఎస్‌.సుధాసాగర్, తహసీల్దార్‌
 

మరిన్ని వార్తలు