ఇద్దరు కి'లేడీ'ల అరెస్ట్..!

3 Sep, 2015 21:22 IST|Sakshi
ఇద్దరు కి'లేడీ'ల అరెస్ట్..!

చిత్తూరు అర్బన్: ప్రయాణికుల్లా బస్సుల్లో రాకపోకలు సాగిస్తూ అదను చూసి పక్కవారి ఆభరణాలను కొట్టేయడం.. ఆ డబ్బుతో జల్సాలు చేయడం వృత్తిగా ఎంచుకున్న ఇద్దరు యువతుల్ని చిత్తూరు టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం మైసూరు సిటీలోని ఎరగనహళ్లికి చెందిన టీఆర్.చిన్నమ్మ అలియాస్ ఆష, రాణి, శివపుత్రుడు అలియాస్ శివ ముగ్గురూ దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నారు.

పుంగనూరు, చిత్తూరు, తిరుపతి రైల్వే స్టేషన్లలో పలు చోరీలకు పాల్పడ్డారు. బస్టాపులు, రైల్వే స్టేషన్లు, బస్సుల్లో రద్దీగా ఉన్న ప్రయాణికుల హ్యాండ్ బ్యాగులు కత్తిరించి చోరీలు చేయడం, నిద్రపోతున్న వారి బంగారు ఆభరణాలు దొంగిలించడంలో వీరు దిట్ట. గురువారం నగరంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు. ఇప్పటి వరకు పలు చోరీలకు పాల్పడి కూడబెట్టిన 200 గ్రాముల బంగారాన్ని, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు