26 నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు

22 Mar, 2017 21:34 IST|Sakshi
కన్నడంలో ఏర్పాటు చేసిన ఉగాది ఆహ్వాన ద్వారం
 - 28న వీరాచార విన్యాసాలు
 - 29న ఉగాది  ప్రత్యేకపూజలు
 - కన్నడిగులందరికీ  మల్లన్న స్పర్శదర్శనం
 
శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో మార్చి 26న ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నా‍యని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ నారాయణభరత్‌గుప్త బుధవారం విలేకరులకు తెలిపారు. ఉత్సవాలు ఈ నెల 30 వరకు కొనసాగుతాయన్నారు. వేడుకలను పురస్కరించుకొని ప్రతి రోజూ  ప్రత్యేక అలంకారాలు, వాహన సేవలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 29న  ఉగాది పర్వదినం సందర్భంగా  దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ శ్రవణం ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం రథోత్సవం కనుల పండువగా జరుగనుందని పేర్కొన్నారు.
 
26న యాగశాల ప్రవేశం..
ఉగాది ఉత్సవాలలో భాగంగా  మార్చి 26న ఉదయం 8.30 యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, శివసంకల్పం, స్వస్తి పుణ్యహవచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణధారణలతో ప్రత్యేకపూజలు ప్రారంభమవుతాయని ఈఓ భరత్‌ గుప్త పేర్కొన్నారు. అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన, చండీహోమాలు జరుగుతాయని తెలిపారు. అదే రోజు సాయంత్రం భ్రమరాంబాదేవిని మహాలక్ష్మి రూపంలో అలంకరించి, స్వామిఅమ్మవార్లను భృంగి వాహనంపై అధిష్టంపజేసి గ్రామోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.  అనంతరం రాత్రి 8గంటల నుంచి శ్రీస్వామివార్లకు కల్యాణోత్సవం, శయనోత్సవపూజలు ఉంటాయని పేర్కొన్నారు.  
 
27 నుంచి 30 వరకు ప్రత్యేక పూజలు  
ఉగాది ఉత్సవాల్లో భాగంగా 27 నుంచి 30 వరకు ప్రతిరోజూ ఉదయం 7.30గంటలకు చండీశ్వరపూజ, మండపారాధనలు, జపానుష్ఠానములు, 9గంటలకు రుద్రహోమం, నిత్యహవనములు ఉంటాయని ఈఓ పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో  విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం  జరుగుతాయన్నారు. సాయంకాలం పూజలలో భాగంగా జపానుష్ఠానములు,  హవన ములు, రాత్రి 8గంటలకు స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, శయనోత్సవకార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. 28న సాయంత్రం  5.30 గంటలకు ప్రభోత్సవం,  రాత్రి 10గంటలకు వీరశైవ భక్తుల వీరాచార విన్యాసాలు ఉంటాయని చెప్పారు. 
 
భక్తులకు  మల్లన్న స్పర్శదర్శనం 
స్వస్తిశ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు  కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలనుంచి  దాదాపు 6 లక్షలమందికిపైగా భక్తులు తరలివస్తారని అంచనా వేశామని, వీరందరికీ వీలైనంత మేరకు  స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. ఉద్యానవనాలు, ఖాళీ ప్రదేశాల్లో  షామియానాలు, చలువ పందిళ్లు వేస్తున్నామని పేర్కొన్నారు.  నిరంతరం మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 
వాహనసేవలు..
ఉగాది ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6.30గంటల నుంచి స్వామి, అమ్మవార్ల అలంకారాలు, వాహనసేవలు, ప్రత్యేక పూజలను ఉంటాయని ఈఓ పేర్కొన్నారు.
 
26వ తేదీ   మహాలక్ష్మి అలంకారం     భృంగివాహనసేవ 
27వ తేదీ      మహాదుర్గ అలంకారం     కైలాసవాహనసేవ
28వ తేదీ   మహాసరస్వతి అలంకారం   నందివాహనసేవ
29వ తేదీ     రమావాణీసేవిత రాజరాజేశ్వరి అలంకారం  
30వ తేదీ  శ్రీ భ్రమరాంబాదేవి నిజాలంకరణ  అశ్వవాహనసేవ 
 
మరిన్ని వార్తలు