'ప్రాణాలు కాదు.. సాధించిన అభివృద్ధే శాశ్వతం'

16 Apr, 2016 13:14 IST|Sakshi

విశాఖపట్నం : ఉన్నత ఆశయం కోసం దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అభినందనీయుడని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రాణాలు శాశ్వతం కాదని... సాధించిన అభివృద్దే శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్ కోసం గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది.ఈ నేపథ్యంలో ఈరోజు అమర్నాథ్ను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఆయన తన సంఘీభావం ప్రకటించారు.

అనంతరం ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా రైల్వే జోన్పై చర్చ జరుగుతోందన్నారు.ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమం చేసిన విశాఖ ఉక్కు సాధించుకున్న నాడే రైల్వే జోన్ కూడా రావాల్సింది అని ఆయన పేర్కొన్నారు. విశాఖకు రైల్వే జోన్ అంటూ బీజేపీ వాగ్దానమే కాదు... తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారం సాధించుకుందంటూ బీజేపీపై ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు.

ప్రస్తుతం ఆ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉందని... అలాంటప్పుడు రైల్వే జోన్పై ఆ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అని ప్రశ్నించారు. 2003లో 9 రైల్వే జోన్లు ప్రకటించినప్పుడు ఏ పార్టీలు లేవని... అలాగే కమిటీలు కూడా లేవన్నారు. కానీ ఇప్పుడే ఆ కమిటీలు వచ్చాయన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో గుడివాడ అమర్నాథ్కి సంఘీభావం తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖకు వస్తున్నారని ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు చెప్పారు.   
 

>
మరిన్ని వార్తలు