-

పెళ్లి చేస్తానని చెప్పిన తర్వాత....

26 Aug, 2015 16:40 IST|Sakshi
పెళ్లి చేస్తానని చెప్పిన తర్వాత....

రాజమండ్రి: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు పరచకుంటే వంచకులవుతారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధిస్తామన్న హామీతో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందని,  హామీ అమలుపై తోకముడిస్తే చరిత్ర క్షమించదన్నారు. ప్రజలకు చంద్రబాబు, వెంకయ్య నాయుడు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. పదే పదే ప్రధానమంత్రిని కలిసి సాధించిందేమిటని నిలదీశారు. ఢిల్లీ నుంచి శుభవార్తతో వస్తారనుకుంటే తలదించుకుని వస్తున్నారని వాపోయారు. పార్లమెంట్ లో ఆరోజు తమ నోరు కట్టేసి విభజన చేశారని, ఇది అంతకన్నా అవమానమని అన్నారు. చట్టంలో ఉన్న వాటిని కూడా సాధించలేకపోతున్నారని విమర్శించారు.

విభజన సమయంలోనే రూ. 10 వేల కోట్లు ఇవ్వాలన్నారని, 17 నెలల కాలంలో కేంద్రం రూ.2300 కోట్లు ఇచ్చిందని చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎందుకింత దారుణం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనడాన్ని ఆయన తప్పుపట్టారు. 'పెళ్లి చేస్తానని చెప్పిన తర్వాత పెళ్లే చేయాలి. పెళ్లి తప్పా మరోటి చేస్తామంటే ఎలా ఒప్పుకుంటార'ని ఉండవల్లి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు