ముద్రగడ దీక్షను కావాలనే జటిలం చేస్తున్నారు!

14 Jun, 2016 22:32 IST|Sakshi
ముద్రగడ దీక్షను కావాలనే జటిలం చేస్తున్నారు!

రాజమహేంద్రవరం క్రైం: ముద్రగడ పద్మనాభం దీక్షను ప్రభుత్వం కావాలనే జటిలం చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 'కాపు రిజర్వేషన్‌పై ప్రభుత్వం వేసిన కమిషన్ రిపోర్టు ఆగస్టు నెలాఖరికి వస్తుంది. రెండు నెలల ముందుగానే కాపు నాయకులను అరెస్టు చేయాలని పాలక పార్టీ పోలీసులపై ఎందుకు ఒత్తిడి తెచ్చింది' అని నిలదీశారు. ప్రభుత్వం జిల్లావ్య్యాప్తంగా వేలమంది పోలీసులను మోహరించిందని, రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డును 7 రేస్ కోర్సు రోడ్డుగా మార్చేసిందని ఎద్దేవా చేశారు.

ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో ఐరన్ ఫెన్సింగ్ (ఇనుప ముళ్ల కంచె) వేసినట్టు రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ వేశారని పేర్కొన్నారు. చంద్రబాబు తలచుకుంటే ఈ సమస్యను గంటలో పరిష్కరించగలరు.. కావాలనే జటిలం చేస్తున్నారని అన్నారు. ముద్రగడ ఇంట్లో దీక్ష చేస్తుంటే తలుపులు పగులగొట్టి, ఆయనను, ఆయన భార్యను ఈడ్చుకురావడం, కుమారుడిని దారుణంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో పేద ప్రజలు హాస్పిటల్‌లోకి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ సమస్యను వెంటనే చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు