టీడీపీది ప్రజావ్యతిరేక పాలన

28 Aug, 2016 23:04 IST|Sakshi
రెడ్డి శాంతి
 రుణాలు మాఫీ చేయకపోవడంతో నిర్వీర్యమవుతున్న డ్వాక్రా సంఘాలు  
 గిరిజన గ్రామాలకు అందని వైద్యం
ప్రత్యేక హోదా సాధించేవరకు వైఎస్సార్‌ సీపీ పోరాటం 
పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
 
శ్రీకాకుళం అర్బన్‌: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నా జిల్లాలో అభివృద్ధి జాడ లేదన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత, నిరుద్యోగులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఇలా ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. ఉద్యోగం, ఉపాధి లేక జిల్లా వాసులు వలసబాట పడుతున్నా నేతలకు పట్టడంలేదని విమర్శించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీలతో అప్పు పెరిగి సంఘాలు నిర్వీర్యమవుతున్నాయని వాపోయారు. 
 
మీడియాకు దూరంగా అచ్చెన్న.. 
 నయీంతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియా ప్రశ్నిస్తుందనే భయంతో కలెక్టర్‌ను తన ఇంటికి పిలిపించుకుని సాగునీరు, పవర్‌ప్లాంట్‌ విషయాలపై చర్చించడం విచారకరమన్నారు. ఇంటిలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం శోచనీయమన్నారు. విప్, ఎమ్మెల్యేలు, ఎంపీ తదితరులెవ్వరూ లేకుండానే సమావేశం నిర్వహించడంలో ఆంత్యర్యమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
బినామీ పేర్లుతో ఇసుక దోపిడీ.. 
 ఇసుక ఉచితమంటూనే బినామీ పేర్లుతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారని రెడ్డి శాంతి విమర్శించారు. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటరమణ కూడా ఇసుక దోపిడీలో భాగస్వామి అయ్యారన్నారు. దీనికోసమే ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి అధికార పార్టీలోకి మారారన్నారు. గిరిజన గ్రామాల్లో వైద్యసదుపాయాలు కరువయ్యాయన్నారు.ఎల్‌.ఎన్‌.పేట మండలం మురుగులోవ గిరిజన గ్రామంలో వైద్య సదుపాయం లేక ఓ గర్భిణి ప్రసవించేందుకు నానా అవస్థలు పడి, చివరకు బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందన్నారు.  
 
హోదా సాధించేవరకు పోరాటం 
రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను గుర్తించిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. ‘ప్రత్యేకహోదా– ఆంధ్రుల హక్కు’  అనే నినాదంతో హోదా సాధించేవరకు పోరాటం ఆపేది లేదన్నారు. 
 
 
మరిన్ని వార్తలు