భూగర్భ జలం అడుగంటి...

6 Jul, 2013 04:35 IST|Sakshi
భూగర్భ జలం అడుగంటి...
 సిటీబ్యూరో, న్యూస్‌లైన్: భూగర్భ జలం అడుగంటి.. నగరం తడారిపోతోంది. కాంక్రీట్ జంగిల్‌లో నీటిబొట్టును ఒడిసిపట్టే పరిస్థితి కరువైంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకే దారులన్నీ మూసుకుపోయి.. విలువైన నీరు వృథాపోతోంది. ఫలితంగా భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. నగరంలో సాధారణ వర్షపాతం 130 మిల్లీమీటర్లు. ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు మహా నగరం పరిధిలో 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 50 మిల్లీమీటర్లు అధికం. కానీ ఈ వర్షపు నీటిని భూగర్భంలోకి మళ్లించేం దుకు అవసరమైనన్ని ఇంకుడుగుంతులు లేవు. దీంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగటం లేదు. 
 
ఇది మునుముందు విపరిణామాలకు దారితీస్తుందని భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సగటున 9.62 మీటర్ల లోతున భూగర్భ జలం లభ్యంకాగా.. ఈసారి 9.91 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే గతేడాదితో పోలిస్తే 0.29 మీటర్ల లోతుకు పడిపోయాయన్న మాట. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్‌లో 60 శాతం మేర వర్షపు నీరు వృథాగా పోతోందని నిపుణులు చెబుతున్నారు. 
 
సాధారణంగా వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం మేర వృథా కావటం సర్వసాధారణమే. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం నీరు వృథాగా పోతోంది. ఈ నీటిని భూగర్భంలోకి మళ్లించగలిగితే జలమట్టాలు మరో రెండు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఇంకుడుగుంతల ఏర్పాటు ద్వా రా పరిస్థితిని చక్కదిద్దాల్సిన జీహెచ్‌ఎంసీ, జలమండలి చోద్యం చూస్తున్నాయి. వీటి ఏర్పాటు రూపేణా గ్రేటర్‌వాసుల నుంచి రూ.కోట్లు వసూలు చేస్తున్న ఈ విభాగాలు అసలు లక్ష్యానికి మాత్రం నీళ్లొదులుతున్నాయి. 
 
 ఎక్కడ చూసినా పాతాళంలోనే..
 గ్రేటర్ పరిధిలోని పలు మండలాల్లో గతేడాది జూన్ నెలాఖరుతో పోలిస్తే ఈ ఏడాది జూన్ చివరి నాటికి భూగర్భ జలమట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. అమీర్‌పేట మండలంలో గతేడాది 19.15 మీటర్ల లోతున భూగర్భ జలాల ఆనవాళ్లు బయటపడగా..ఈ సారి 19.20 మీటర్ల లోతునకు తవ్వాల్సిన పరిస్థితి. మారేడుపల్లి, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, నాంపల్లి, చార్మినార్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి తదితర మండలాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని జలమట్టాల లెక్కలు చెబుతున్నాయి. 
 
 ఇంకుడుగుంత ఉండాలిలా..
 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలంలో ఇల్లు ఉన్న వారు బోరు బావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో గుంతను ఏర్పాటుచేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంత తీసి ఇందులో 50 శాతం మేర 40 ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం మేర 20 ఎంఎం సైజులో ఉండే గులకరాళ్లను నింపాలి. మరో 15 శాతం మేర ఇసుక (పెద్ద సైజు)ను నింపాలి. మరో పది శాతం మేర ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ గుంతపై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భ జలాల రీచార్జి సులువవుతుంది. ఇలాబోరుబావి పది కాలాల పాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఇల్లు, కార్యాలయంలో విస్తీర్ణాన్ని బట్టి ఇంకుడుగుంత పరిమాణం మారుతుందని తెలిపారు.
 
 భూగర్భ జలం తగ్గడానికి కారణాలివే
 మహానగరం పరిధిలో అపార్ట్‌మెంట్లు, భవనాల సంఖ్య సుమారు 22 లక్షలు. కానీ వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అందుబాటులో ఉన్న రీఛార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంతలు) 25 వేలలోపే. ఫలితంగా భూమిపై పడిన వర్షపు నీటిలో 60 శాతం మేర వృథా అవుతోంది
 
 గ్రేటర్ పరిధిలో భూగర్భ జలమట్టాలు (వాటర్‌టేబుల్) పెంచేందుకు గతేడాది జీహెచ్‌ఎంసీ 10 వేలు, జలమండలి 22 వేల ఇంకుడు గుంతల ఏర్పాటుకు వినియోగదారుల నుంచి రూ.64 కోట్ల మేర రాబట్టాయి. కానీ 5 వేల ఇంకుడు గుంతలే తవ్వారు
 
 మహా నగరంలోని ఇళ్లు, కార్యాలయాల ఆవరణలో నీటినిల్వకు ఇంకుడుగుంతల్ని తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చటం లేదు
 
 నిపుణులు ఏమంటున్నారంటే..
 ఇంకుడు గుంతలు తప్పనిసరి
 ప్రతి ఇళ్లు, కార్యాలయం, భవంతికి ఇంకుడుగుంత తప్పనిసరిగా ఉండాలి. వర్షపునీటి వృథాను అరికట్టాలంటే ఇంకుడుగుంతలే చక్కటి ప్రత్యామ్నాయం. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ఇంకుడు గుంతల ఏర్పాటుతో ఇళ్లలో బోరుబావులు ఎండిపోవనే విషయాన్ని గుర్తించాలి.
 - సత్యనారాయణ,  భూగర్భ జలశాఖ నిపుణుడు, జలమండలి
 
 సమగ్ర నీటి విధానం అవసరం
 మహానగరంలో జలమండలి అందిస్తున్న నీళ్లు ప్రధాన నగరం అవసరాలకే సరిపోతున్నాయి. శివారు ప్రాంతాల్లోని 870 కాలనీల్లో మెజార్టీ ప్రజలకు భూగర్భ జలాలే ఆధారం. వాడకం పెరిగి అవీ అడుగంటిపోతున్నాయి. సమగ్ర నీటి విధానం, పౌరులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రాజధానిలో లక్షల సంఖ్యలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలమట్టాలు పెంచాలి.
 - ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, 
 చేతన సొసైటీ చీఫ్ మెంటార్ (ఫోటో ఉంది)
 
మరిన్ని వార్తలు