అవగాహనతోనే సైబర్‌ నేరాల నియంత్రణ

17 Dec, 2016 22:33 IST|Sakshi
కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సందీప్‌ శాండిల్యా, జాయింట్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐడీఆర్‌బీటీ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ వీఎన్ శాస్త్రి)

సాక్షి, సిటీబ్యూరో: ప్రజలు సైబర్‌ నేరాలు బారినపడకుండా ఉండేందుకు ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన పెంపొందించుకోవాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్యా అన్నారు.  సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సహకారంతో  సైబరాబాద్‌ కమిషనరేట్‌లో పోలీసులు, క్యాబ్, ఆటో డ్రైవర్లకు నగదు రహిత లావాదేవీలపై శనివారం ఐడీఆర్‌బీటీ ఫ్రొఫెసర్, మొబైల్‌ పేమెంట్‌ ఫోరమ్‌ ఫర్‌ ఇండియా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ వీఎన్ శాస్త్రి, సైబర్‌ సెల్‌ ఏసీపీ జయరాం  అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీపీ సందీప్‌ శాండిల్యా మాట్లాడుతూ...సైబర్‌ నేరాల్లో రికవరీ కావడం చాలా కష్టమని, అందుకే సైబర్‌ నేరాలు జరిగే తీరు, వాటి బారినపడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నగదు రహిత లావాదేవీల వినియోగం కారణంగా ఎదురయ్యే కొత్త తరహా మోసాలను ఆధునిక పరిజ్ఞానంతో పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం లా అండ్‌ అర్డర్, సైబర్‌ సెల్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. జాయింట్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ...మొబైల్‌ పేమెంట్‌లపై వివిధ టెక్నిక్‌లను వినియోగదారులకు వివరించడంపై దృష్టి సారించాలన్నారు.

ఒకటి ఆఫ్‌లైన్, ఒకటీ ఆన్లైన్ లావాదేవీల కోసం రెండు బ్యాంక్‌ ఖాతాలు వినియోగించడం ద్వారా సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టవచ్చన్నారు.  మొబైల్‌ బ్యాంకింగ్‌లో ఆ¯న్లైన్ నగదు లావాదేవీలకు అన్స్ట్రక్చర్‌డ్‌ సప్లిమెంటరీ సర్వీసు డాటా (యూఎస్‌ఎస్‌డీ) ఎంతో ఉత్తమమని డాక్టర్‌ వీఎన్ శాస్త్రి వివరించారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కనడ, పంజాబీ తదితర అన్ని భాషల్లో యూఎస్‌ఎస్‌డీ ఉంటుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకైనా సులభంగా ఆన్లైన్ నగదు లావాదేవీలు అర్ధమవుతాయన్నారు. క్రెడిట్‌కార్డు మోసాలు, ఫిషింగ్, స్కిమ్మింగ్, విషింగ్‌లపై వివరించారు.సైబర్‌ నేరగాళ్ల ఎత్తుగడలు,  పోలీసులు స్పందించాల్సిన తీరుపై ఏసీపీ జయరాం వివరించారు.

ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి భరణి కుమార్‌ మాట్లాడుతూ...‘మొబైల్‌ వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉందని, నగదు రహిత లావాదేవీలపై అవగాహన తీసుకరావడం ద్వారా క్యాష్‌లెస్‌ ఎకానమీలో ప్రపంచంలోనే తొలి స్థానం సాధించవచ్చ’ని వివరించారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలు, ఈ–కాప్స్, షీ టీమ్స్, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిథులు పాల్గొన్నారు.



 

మరిన్ని వార్తలు