కుదరదు గాక కుదరదు

28 Nov, 2015 01:47 IST|Sakshi
కుదరదు గాక కుదరదు

జూన్ 1 తర్వాత హైదరాబాద్ నుంచి పనిచేయడానికి నో
♦ సచివాలయంతోసహా అన్ని శాఖలూ కొత్త రాజధానికే
♦ ఆలోగా అన్ని రికార్డులు ఇ-ఆఫీస్‌లో ఉంచాలి : సీఎం ఆదేశం
♦ సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి.. హడావుడెందుకని ప్రశ్న
 
 సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ తరువాత హైదరాబాద్ నుంచి పనిచేయడానికి ఎవరినీ అనుమతించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఉన్నతాధికారులు, మంత్రుల సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోను జూన్ 1వ తేదీ తరువాత సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలు హైదరాబాద్ నుంచి పనిచేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. జూన్ 1 నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు, సచివాలయ శాఖలు నూతన రాజధాని నుంచే పనిచేయాలన్నారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల రికార్డుల్ని ఇ-ఆఫీస్‌లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని, జూన్ 1 నాటికి ఇ-ఆఫీస్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

 ఎవరి మేలుకోసం ఈనిర్ణయమంటున్న ఉద్యోగులు..
 సీఎం ఆదేశాలపై సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టకుండా హడావిడిగా హైదరాబాద్ నుంచి ఆఫీసుల్ని, ఉద్యోగులను తరలించడమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ఇ-ఆఫీసులోనే ఫైలును పంపించాలని నిర్ణయం తీసుకున్నందున ఎక్కడినుంచి పనిచేస్తే ఏమిటని అంటున్నారు. ఇ-ఆఫీస్ అమల్లోకి వచ్చినందున నూతన రాజధానిలో సచివాలయంతోపాటు ఇతర శాఖల కార్యాలయాల నిర్మాణం పూర్తయ్యేవరకు హైదరాబాద్‌లోనే ఉద్యోగులు పనిచేయడం వల్ల ప్రభుత్వ నిధులు ఆదా అవుతాయని పేర్కొంటున్నారు.

పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నందున హడావుడిగా హైదరాబాద్‌ను వీడివెళ్లాల్సిన అవసరం ఏముందని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భవనాల్ని అద్దెకు తీసుకుని, వారికి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకే ప్రభుత్వం తరలింపు హడావుడి చేస్తోందనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. లింగమనేని సంస్థకు చెందిన అతిథిగృహంలో ముఖ్యమంత్రి నివసిస్తున్నందున అందుకు ప్రతిగా అదే సంస్థకు చెందిన విల్లాల్ని, అపార్ట్‌మెంట్లను ఎక్కువ ధర అద్దె చెల్లించి మంత్రులు, ఉన్నతాధికారుల నివాసానికి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

కాగా నూతన రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి అధికారుల కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దాని ఆధారంగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రుల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా శనివారం సీఎం నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఉద్యోగులు, కార్యాలయాల తరలింపుపైనా చర్చించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు