ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ను వేగవంతం చేయాలి

20 Apr, 2017 22:19 IST|Sakshi
ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ను వేగవంతం చేయాలి
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌సెంటర్‌) : ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ను వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అన్నారు. గురువారం పట్టణానికి విచ్చేసిన ఆయన జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భర్తీ కాకుండా ఉన్న పోస్టులు ఎంఈఓ, జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు, డెప్యూటీ డీఈఓలు, డైట్‌ అధ్యాపకులు పోస్టులను అర్హత, తగ్గ సీనియార్టీలతో ప్రభుత్వ, జెడ్పీ తేడాలు లేకుండా భర్తీ చేయాలన్నారు. సీఎం, విద్యాశాఖ మంత్రి సహకారంతో ఢిల్లీ వరకు ఫైల్‌ను నడిపించామన్నారు. తుదిదశకు చేరిందని, అతికొద్దికాలంలో సవరణలతో రాష్ట్రపతి ఆమోదం పొందుతుందన్నారు. ఇరు రాష్ట్రాలకు నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఇప్పటికే ఎంఈఓలను రెగ్యులర్‌ చేయించామని చెప్పారు. 2004 తరువాత ఎవరైతే ఉద్యోగాల్లో జాయిన్‌ అయ్యారో వారికి సంబంధించి రిటైర్‌మెంట్‌ అయినా, మధ్యలో చనిపోయినా వారు అనేక విధలుగా నష్టపోతున్నారని, మానవత దృక్పథంతో పరిశీలించాలని కోరామన్నారు. సీపీఎస్‌ విధానం రద్దుకు కేంద్రం పునరాలోచన చేస్తుందన్నారు. పీఆర్‌టీయూ సర్వీస్‌ రూల్స్‌ను సాధ్యం చేయడం, సీపీఎస్‌ విధానంను అంతం చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీగా తన వంతు సహాయ సహకారాలు ఉపాధ్యాయులకు ఉంటాయని ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రంలో సర్వీస్‌ రూల్స్‌ తుది దశకు చేరుతున్నందున పీఆర్‌టీయూ తొలుత పదోన్నతులు కల్పించడం ద్వారా బదిలీలు చేపట్టాలని చెబుతుందన్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కమలాకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు డీఏలు చెల్లించాల్సి ఉందన్నారు. 10 నెలలుగా పీఆర్సీ ఏరియర్స్, హాఫ్‌ లీవ్‌ ఎన్‌కేష్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. 398 నోషనల్‌ ఇంక్రిమెంట్లు తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. నిరంతర సమగ్ర మూల్యంకనం విధానం రద్దు చేయాలని, కంప్యూటర్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని నియామకాలు చేపట్టాలన్నారు. పీఈటీ, గ్రేడ్‌ పండిట్‌లను నూటికి నూరుశాతం భర్తీ చేయాలన్నారు. 
మరిన్ని వార్తలు