‘ఇందిరమ్మ’ యూనిట్ కాస్ట్ తగ్గింపు యోచన?

8 Oct, 2015 01:09 IST|Sakshi
‘ఇందిరమ్మ’ యూనిట్ కాస్ట్ తగ్గింపు యోచన?

♦ అందరికీ ఏకరీతిన రూ.70 వేలు
♦ ప్రభుత్వానికి గృహనిర్మాణ శాఖ అధికారుల ప్రతిపాదన?
♦ నేడు తుది నిర్ణయం!
 
 సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల రూపంలో పెండింగు బిల్లుల భారం గుదిబండగా మారడంతో దాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.500 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో... ఆ ఇళ్ల యూనిట్ కాస్ట్‌లోనే మార్పులు చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రభుత్వం ముందుంచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందిరమ్మ పథకంలో ఇంటి యూనిట్ కాస్ట్ రూ.70 వేలుగా ఉంది. అదే ఎస్సీలైతే రూ.లక్ష, ఎస్టీలైతే రూ.1.05 లక్షలుగా ఉంది.

కేంద్రప్రభుత్వం ఇందిరా ఆవాస్ యోజన ఇళ్ల యూనిట్‌కాస్ట్‌లో చేసే మార్పులకు తగ్గట్టుగా రాష్ట్రప్రభుత్వం కూడా వాటిని మారుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట ఈ యూనిట్‌కాస్ట్‌ను ఆ మేరకు పెంచింది. ఇప్పుడు వాటిని తగ్గించి అందరికీ రూ.70 వేలుగా చేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇందిరా ఆవాస్ యోజన స్థానంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఎలాగూ ‘ఇందిరా ఆవాస్’కు కాలదోషం పట్టుకున్న నేపథ్యంలో దాని యూనిట్ కాస్ట్‌ను అమలు చేయడమెందుకనేది అధికారుల వాదన. యూనిట్‌కాస్ట్ తగ్గిస్తే ప్రభుత్వంపై ‘పెండింగు బిల్లుల’ భారం భారీగా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైలు గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డి వద్దకు చేరినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే రాష్ట్రప్రభుత్వంపై దాదాపు రూ.వంద కోట్ల వరకు భారం తగ్గుతుందని అధికారులు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. గురువారం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.

 పాతపద్ధతే కొనసాగుతోంది: ఇంద్రకరణ్‌రెడ్డి
 దీనిపై గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరణ కోరగా...‘ఇప్పటి వరకు మార్పు చేర్పులు చేయలేదు. పాత పద్ధతే కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగు బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించాం. యూనిట్‌కాస్ట్ మార్పు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు