విద్యార్థులతో మమేకం

5 Aug, 2016 17:49 IST|Sakshi
విద్యార్థులతో మమేకం
ఏయూక్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థులతో ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు మమేకమవుతున్నారు. నిత్యం తరగతులను సందర్శిస్తూ, హాస్టల్స్‌లో ఆకస్మికంగా కలియదిరుగుతూ విద్యార్థుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం ఏయూ కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు తరగతిగదులను పరిశీలించి, తరగతులు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థుల నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకున్నారు. తరగతులు జరుగుతున్న విధానాన్ని విద్యార్థుల మాటల్లో విన్నారు. ప్రతీ తరగతిలో అధ్యాపకులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థులు పూర్తిస్థాయిలో తరగతులకు  హాజరుకావాలని సూచించారు.
పరిశోధకుల హాజరు తక్కువగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విభాగాధిపతులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరిశోధకులు క్రమం తప్పకుండా విభాగంలో ఉండాలన్నారు. పరిశోధన ప్రగతిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. 
ఏయూ అవుట్‌గేట్‌ వద్దనున్న ఆవుల జయప్రదాదేవి భవనాన్ని వీసీ నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ భనవాన్ని విద్యార్థినుల వసతిగహంగా మార్పుచేస్తున్నామన్నారు. వర్సిటీకి చేరువలో వసతిగహం ఏర్పాటుకావడం మంచి పరిణామన్నారు. పూర్తిస్థాయిలో వసతులు, మెస్‌ సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు కోరిన విధంగా రీడింగ్‌ రూమ్, వైఫై సదుపాయాలను ఏర్పాటుచేస్తామన్నారు. త్వరలో మరికొన్ని అదనపు వసతిగహాలను నిర్మించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉదయం వసతిగహాన్ని రిజిస్ట్రార్‌ సందర్శించారు. చీఫ్‌ వార్డెన్‌ ఆచార్య టి.శోభశ్రీ పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు