మరణశయ్యపై మన్యం

8 Sep, 2016 01:18 IST|Sakshi
మరణశయ్యపై మన్యం
తూర్పు మన్యంలో మృత్యువు గాండ్రిస్తోంది. సీజనల్‌ వ్యాధులతో పాటు అంతు చిక్కని రోగాలతో అడవిబిడ్డలు అకాల మరణం పాలవుతున్నారు. విలీన మండలాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇరవై రోజుల వ్యవధిలో
ఐదుగురు అంతుపట్టని కాళ్ళవాపు వ్యాధితో ప్రాణాలు విడిచారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. మలేరియాతో పాటు ఈ వ్యాధి ఆదివాసీల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘తూర్పు’లో మన్యం వాసులకు వింత వ్యాధి సోకింది. వ్యాధి సోకి 20 రోజులైనా ఇంతవరకు వైద్యులు కూడా ఇది ఏ వ్యాధో గుర్తించలేకపోయారు. అంతుచిక్కని ఈ వ్యాధితో ఇంతవరకు ఐదుగురు గిరిజనులు మృత్యువాతపడటం మన్యంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జిల్లాలోని విలీన మండలమైన వీఆర్‌పురం వాసులను ఈ వ్యాధి వేధిస్తోంది. ఈ మండలంలోని రేఖవానిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం, లక్ష్మీనగరం గ్రామాల గిరిజనులు వ్యాధితో చిగురుటాకుల్లా 
వణికిపోతున్నారు. గత నెల 14తేదీన ఈ గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని బురకా మంగవేణి, ఈ నెల ఒకటో తేదీన అదే గ్రామానికి చెందిన మరో ఇంటర్‌ విద్యార్థి గొడ్ల కన్నయ్య ఇవే లక్షణాలతో మృత్యువాతకు గురయ్యాడు. తాజాగా మంగళవారం బురకా ఎర్రయ్య అనే గిరిజనుడు కూడా ఇవే లక్షణాలతో మృత్యువాతకు గురికావడంతో గిరిజనం ఆందోళన చెందుతోంది. ఈ గ్రామానికి సమీపాన ఉన్న లక్ష్మినగరానికి చెందిన సరియం బాబురావు కూడా సోమవారం మృతిచెందాడు. ఇంతవరకు ఈ ఒక్క మండలంలో నలుగురు గిరిజనులు మృత్యువాతకు గురయ్యారు. 
రేఖపల్లి పంచాయతీ పరిధిలో అన్నవరం శివారుచెరువు గుంపు గ్రామంలో 200 కుటుంబాలున్నాయి. అంతా వ్యవసాయ కూలీలే. అన్నవరం గ్రామంలోని చెరువుగుంపులో ఈ జ్వరాలతో తొమ్మిది మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకి గొడ్ల సింగయ్య, సోడె కన్నయ్య, సోడె పెదకన్నయ్య, కారం రామారావు, కబడి రాజు, సోడె లక్ష్మయ్య, కారం ఎర్రయ్య, కొవ్వాసి వీరారెడ్డి, కుంజా రాజయ్య తదితరులు మంచంపట్టారు. వీరు కాకుండా మండలంలోని శివారు గ్రామాల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలతో మరికొందరు గిరిజనులు బాధపడుతున్నారని జిల్లా కేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆ గ్రామాల్లో దోమకాటున్నా మలేరియా కేసులు ఇంతవరకు రికార్డు కాలేదు. పోనీ డెంగీ అనుకుంటే ప్లేట్‌లేట్స్‌ కూడా ఏమీ తగ్గడం లేదని వీఆర్‌పురం మండలం రేఖపల్లి పిహెచ్‌సి వైద్యుడు దుర్గాప్రసాద్‌ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన  జిల్లా వైద్యాధికారి చంద్రయ్య  దృష్టికి తీసుకువెళ్లారు. విషయం  తెలిసిన రేఖపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్‌ ఏ.రామారావు, దుర్గాప్రసాద్‌ అన్నవరం గ్రామానికి  వెళ్లి కాళ్ల  వాపు వ్యాధితో బాధపడుతున్న బాధితుల నుంచి, మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆ వ్యాధికి సంబంధించిన వివరాలు  తెలుసుకున్నారు.
వ్యాధి లక్షణాలు...
ఈ గిరిజన గ్రామాల్లో సాధారణంగా జ్వరం వస్తే ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయేది. కానీ ఇటీవల కాలంలో వస్తున్న జ్వరాలకు స్థానిక వైద్యులు చెప్పే ముందులు వాడుతున్నా తగ్గడం లేదు. సరికదా, మరుసటి రోజుకు జ్వరం తీవ్రత 102 డిగ్రీలకు పెరిగిపోతోంది. రెండు రోజులకు కళ్లు తిరగడం, వాంతులు కావడం జరుగతుంది. మూడో రోజుకు కాళ్లకు నీరుపట్టేసి పైకి లేవలేని పరిస్థితికి చేరుకుని మంచం పట్టేస్తున్నారు. మూడో రోజు జ్వరం తీవ్రత పెరిగి అపస్మారక స్థితికి చేరుకుని నాలుగో రోజుకు మృత్యువాతకు గురవతున్నారు. వ్యాధి వచ్చిన గిరిజనులకు కుటుంబ సభ్యులు స్థానికంగానే వైద్యం చేయించినా జ్వరం తీవ్రత పెరిగి పై నుంచి కిందవరకు ళ్లువాసిపోతున్నాయి. 
పసర వైద్యంపై అనుమానం...
జ్వరమొస్తే సహజంగా నాటు వైద్యాన్ని కూడా ఇక్కడి గిరిజనులు ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా జ్వరం ఎక్కువగా ఉంటే పసర వైద్యాన్ని తీసుకోవడం ఇక్కడ పరిపాటి. గతంలో ఇలా పసర వైద్యం తీసుకున్నా ఎప్పుడూ ఇలా జరగలేదని గిరిజనులు చెబుతున్నారు. ఉబ్బు కామెర్లుగా భావించి పసర వైద్యం చేయించుకోవడంతో ఇలా కాళ్లు వాపు వ్యాధి వచ్చిందంటున్నారు. వీఆర్‌పురం మండలం కన్నాయగూడెంలో ఐదేళ్ల్ల క్రితం ఇదేరకంగా కాళ్లవాపు వ్యాధితో పలువురు గిరిజనులు మృతి చెందారని స్థానికులు చెప్పారు.
రక్త నమూనాల సేకరణ... 
వ్యాధి లక్షణాలు ఏమిటనేది తెలుసుకునేందుకు వ్యాధిగ్రస్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బుధవారం రాత్రి పొద్దుపోయాక ఏర్పాట్లు చేసింది. వ్యాధితో బాధపడుతున్న తొమ్మిది మందిని కాకినాడ జీజీహెచ్‌కు బుధవారం రాత్రి తరలించేందుకు నిర్ణయించి ఆ మేరకు ఆంబులెన్సులు సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు