ఆల్కహాల్ తాగొద్దన్నారనీ..

3 Jun, 2016 11:12 IST|Sakshi

- ఎనగుర్తిలో ఘటన
- హత్య చేశారంటూ మృతుడి సోదరుడి ఆరోపణ


దుబ్బాక: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఎనగుర్తికి చెందిన చెప్యాల బాలయ్య(23) అదే గ్రామానికి చెందిన ఇస్తారి లక్ష్మీనారాయణ ఇంటికి రెండేళ్ల క్రితం ఇల్లరికం వెళ్లాడు. బాలయ్య కూలీనాలీ చేస్తూ ఏడాదిన్నర వరకు కుటుంబాన్ని పోషించాడు. ఇటీవల బాలయ్య తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.

బుధవారం రాత్రి బాలయ్య తాగి ఇంటికొచ్చాడు. ఎందుకు తాగావని కుటుంబ సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన బాలయ్య ఇంట్లో ఉన్న విషపు గుళికలు మింగాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలయ్యను హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. బాలయ్యకు భార్య కవిత, కూతురు ప్రణీత ఉన్నారు. బాలయ్యది ఆత్మహత్య కాదని విషం పెట్టి హత్య చేశారని బాలయ్య అన్న చెప్యాల కనకయ్య ఆరోపించారు. ఈ మేరకు భూంపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు