మినీ ట్యాంక్‌బండ్‌గా ‘ఊరు చెరువు’

24 Jul, 2016 20:56 IST|Sakshi
మినీ ట్యాంక్‌బండ్‌గా ‘ఊరు చెరువు’
ధర్పల్లి: మండల కేంద్రంలోని ఊర చెరువు మినీట్యాంక్‌ బండ్‌గా మారబోతోంది. మిషన్‌కాకతీయ మొదటి విడతలో ఇటీవల రూ.కోటి వ్యయంతో చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీనిని మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం రూ.2.06కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులో 265.00టీఎంసీల నీరు నిలువ ఉండేలా పనులు చేపట్టారు. చెరువు కింద 500ఎకరాల ఆయకట్టు ఉంది. ఊరచెరువు మినీట్యాంక్‌బండ్‌గా మారితే పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రానుంది. ఊరచెరువులోకి ఇన్‌ఫ్లో వచ్చే రంగం చెరువు ఫీడర్‌ చానల్‌ పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే చెరువు జలకళను సంతరించుకోనుంది. రంగం చెరువు ఫీడర్‌ పనులకు అనుమతి లభించేలా అధికారులు, పాలకులు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. చెరువుకట్ట అలుగుపై వంతెన నిర్మాణంతో పాటు పోలిస్‌స్టేషన్‌ నుంచి కట్టపైకి దారి ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతంగా అలరించనుంది. 
పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలి
ఊరచెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా మార్చడం సంతోషంగా ఉంది. పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలి. పర్యాటకులను అలరించే విధంగా పరసరాలను తీర్చిదిద్దాలి.  చెరువులోకి గ్రామంలోని మురుగునీరు చేరుతోంది. మురుగునీరు చెరువులోకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అప్పుడే మినీ ట్యాంక్‌ బండ్‌ సక్సెస్‌ అవుతుంది. నిధులు విడుదల చేసిన పాలకులకు కృతజ్ఞతలు
కర్క గంగారెడ్డి, సర్పంచ్, ధర్పల్లి 
మరిన్ని నిధులు కేటాయించాలి
ఊర చెరువును మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులు కేటాయించాలి. సీతాయిపేట్‌ గ్రామ ప్రజలకు అహ్లాదకర వాతావరణం అందుబాటులో ఉండే విధంగా మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మించాలి. ప్రస్తుతం కేటాయించిన నిధులు సరిపోవు. పర్యాటక కేంద్రం ఏర్పాటు రెండు గ్రామస్తులకు ఉపయోగపడేలా ఉండాలి. అప్పుడే ట్యాంక్‌ బండ్‌కు పర్యాటకుల రద్దీ పెరుగుతుంది.
మోహన్‌లాల్, ఎంపీటీసీ సభ్యుడు, సీతాయిపేట్‌ 
 
మరిన్ని వార్తలు