అపోలోకు అర్బన్‌హెల్త్‌ సెంటర్లు

10 Sep, 2016 00:54 IST|Sakshi
 – టెలీనన్సల్టెన్సీతో స్పెషాలిటీ వైద్యం
– అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం
 
కర్నూలు(హాస్పిటల్‌): అర్బన్‌హెల్త్‌ సెంటర్లు ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ అపోలో హాస్పిటల్స్‌ యాజమాన్యం చేతికి దక్కాయి. వీటిని అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోణహన్‌ను అపోలో ప్రతినిధులు కలిశారు. జిల్లావ్యాప్తంగా 20 అర్బన్‌హెల్త్‌ సెంటర్లు పట్టణాల్లోని మురికివాడల్లో పేదలకు ఉచితంగా ప్రాథమిక వైద్యసేవలు అందిస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు వీటిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహించేవి. ఈ సంస్థల నుంచి రెండు నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అర్బన్‌హెల్త్‌ సెంటర్లను స్వాధీనం చేసుకుంది. వీటి నిర్వహణ సరిగ్గా లేదన్న కారణం చూపి తెలుగుదేశం ప్రభుత్వం అపోలో హాస్పిటల్స్‌ యాజమాన్యానికి అప్పగించింది. ఇకపై అర్బన్‌హెల్త్‌ సెంటర్లను అర్బన్‌ పీహెచ్‌సీలుగా పరిగణిస్తారు. ఇందులో పలు రకాల వ్యాధినిర్దారణ పరీక్షలు చేస్తారు. అవసరమైతే స్పెషాలిటి వైద్యుల(అపోలో వైద్యులు)తో అర్బన్‌పీహెచ్‌సీలో ఉన్న వైద్యులు టెలి కన్సల్టేషన్‌ విధానంలో మాట్లాడి చికిత్స అందిస్తారు. ఈ ఆసుపత్రికి వచ్చిన రోగి హెల్త్‌ ప్రొఫైల్‌ను ఆధార్‌నెంబర్‌ ద్వారా లింక్‌ చేసి కంప్యూటరైజ్‌ చేస్తారు. తర్వాత సదరు రోగి ఎప్పుడు వచ్చినా ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా వ్యాధి వివరాలు తీసి వైద్యం అందించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి శుక్రవారం అపోలో హాస్పిటల్‌ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ అందించే సేవల గురించి వారు చర్చించినట్లు సమాచారం.
 
మరిన్ని వార్తలు