చాక్లెట్లు తెచ్చా.. లే అమ్మా!

27 Jan, 2017 02:17 IST|Sakshi
చాక్లెట్లు తెచ్చా.. లే అమ్మా!

పొద్దునే లేచి నన్ను రెడీ చేస్తివే.. చాక్లెట్లు తెస్తవా అంటివే..  నీ కోసం చాక్లెట్లు తెచ్చానమ్మా.. లే అమ్మా..ఒక్కసారి నన్ను చూడమ్మా.. నాతో మాట్లాడమ్మా.. అంటూ ఆ చిన్నారి తన తల్లి చెంపలు నిమురుతూ, గుండెలపై పడి ఒక్కో మాట అడుగుతుంటే అక్కడుకున్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. గణతంత్ర దినోత్సవానికి అందంగా తయారైన తన ముద్దుల తనయ తిరిగి ఇంటికొచ్చే సరికే ఆ తల్లి నిర్జీవంగా మారడంతో ఆ పసి హృదయం విలవిల్లాడిపోయింది.  
- గుత్తి
---------------------------------------------
గుత్తి సీపీఐ కాలనీలో నివాసముండే బేల్దారి మల్లికార్జున భార్య ఉరుకుందమ్మ గురువారం ఆత్మహత్య చేసుకుంది. భర్త వ్యసనాలకు బానిస కావడం.. తాగేందుకు చేసిన అప్పులు తడిసిమోపెడవడం.. అప్పుల వారి ఒత్తిళ్లు ఎక్కువ కావడం.. మరోవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల భవిష్యత్తు ఆ ఇల్లాలిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. భర్తలో మార్పు తీసుకువద్దామని ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఇక జీవితంపై విరక్తి పెంచుకుంది. చివరకు ఉరుకుందమ్మ ఆత్మహత్య చేసుకుంది.

పాపను ముస్తాబు చేసి..
పాఠశాలలో జరిగే గణతంత్ర దినోత్సవానికి కుమార్తె ఉషా(ఏడో తరగతి)ను రెడీ చేయాలని ఐదు గంటలకే ఉరుకుందమ్మ నిద్ర లేచింది. పాపను తలంటుస్నానం చేయించి, కొత్త బట్టలు వేసింది. టాటా చెపుతూ.. వచ్చేటప్పుడే తనకు చాక్లెట్లు తీసుకురావాలని కోరింది. సరేనమ్మానంటూ ఆ చిన్నారి తల్లికి టాటా చెప్పి బయలుదేరింది.

చాక్లెట్లు తల్లికి ఇద్దామని తొందరగా ఇంటికొచ్చినా...
బడిలో ఇచ్చిన చాక్లెట్లను తన తల్లికి ఇద్దామని ఆత్రంగా ఇంటికొచ్చిన ఆ చిట్టి తల్లికి ఇంటి ముందు జనాలు గుంపుగా ఉండడం చూసి ఏం జరిగిందో అర్థం కాలేదు. లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా మారిన తల్లిని చూసి కన్నీరుమున్నీరైంది. చాక్లెట్లు కావాలంటివే అమ్మా.. నీకోసమే తెచ్చాను తిను తల్లీ.. నువ్వే తినకపోతే ఇక ఈ చాక్లెట్లు ఎవరికి ఇవ్వాలమ్మా..అంటూ ఆ చిన్నది అడగడం అక్కడున్న వారి హృదయాలను బరువెక్కించింది. తల్లి గుండెలపై పడి రోదించిన చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుకార్చారు. ఆ చిట్టి తల్లిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుమారుడు విశ్వనాథ్‌ సైతం అమ్మ మృతదేహంపై పడి హృదయ విదారకంగా విలపించాడు.

మరిన్ని వార్తలు