నిజమైన అన్నయ్య ఎన్టీఆరేనని ...

16 Feb, 2016 08:47 IST|Sakshi
నిజమైన అన్నయ్య ఎన్టీఆరేనని ...

ఏలూరు : ప్రస్తుత సమాజంలో హాయ్.. బాయ్.. కల్చర్ ఎక్కువైందని, ఆ రోజుల్లో పెద్దలకు ఇచ్చిన గౌరవ మర్యాదలు ఇప్పుడు ఇవ్వడం లేదని అలనాటి నటి ఊర్వశి శారద అన్నారు. పిల్లలకు సంస్కృతి నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని సోమవారం ఆమె దర్శించుకున్నారు. శ్రీవారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో ముచ్చటించారు.
 
సాక్షి : మీ సొంతూరు, కుటుంబ నేపథ్యం
శారద : మాది గుంటూరు జిల్లా తెనాలి. నా అసలు పేరు సరస్వతి. తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సత్యవతిదేవి. మా నాన్న నగల వ్యాపారం చేసేవారు.
 
సాక్షి : సినీ నేపథ్యం
శారద : చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకున్నా. నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. 1955లో కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా నటించా. కొంతకాలం హాస్యనటిగా కొనసాగాను. తెలుగుతో పాటు మళయాళ చిత్రాల్లో నటించాను.

సాక్షి : గుర్తింపు తెచ్చిన చిత్రాలేమిటి
శారద: శారద, నిమజ్జనం, ఊర్వశి, ఇంద్రధనస్సు, కొండవీటి సింహం, అనసూయమ్మగారి అబ్బాయి, మేజర్ చంద్రకాంత్, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలెన్నో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. చండశాసనుడు చిత్రంలో ఎన్టీఆర్‌కు చెల్లెలుగా నటించా. నిజమైన అన్నయ్య ఎన్టీ రామారావేనని నాకు అనిపిస్తుంది.

సాక్షి : మీకొచ్చిన అవార్డులు
శారద : మూడుసార్లు జాతీయ అవార్డులు, బెస్ట్ యాక్టర్ అవార్డులను అందుకున్నాను. నిమజ్జనం సినిమాకు రెండుసార్లు ఊర్వశి అవార్డులు వచ్చాయి. జాతీయ స్థాయిలో అందుకున్న ఎన్టీఆర్ అవార్డు ఎంతో సంతృప్తినిచ్చింది.
 
సాక్షి : మీ రాజకీయ నేపథ్యం
శారద:  నాకు రాజకీయాలు అంటే ఇష్టం. ఆనాడు ఎన్టీఆర్ పిలిచినా రాజకీయాల్లోకి వెళ్లలేదు. తర్వాత చంద్రబాబు ఆహ్వానంతో టీడీపీలో చేరి సొంతూరు తెనాలి ఎంపీగా పోటీచేసి గెలుపొందాను. అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లో రాణించలేకపోయా. దివంగత నేత వైఎస్సార్ కూడా రాజకీయాల్లో ఎంతగానో ప్రోత్సహించారు.

సాక్షి : ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం
శారద : నేను రాజకీయవేత్తను కాదు. సోషల్ సర్వీస్‌పైనే నటులకు ఎక్కువ దృష్టి ఉంటుంది. దానికి పదవి అక్కర్లేదు.

సాక్షి: అభిమానులకు మీరు చెప్పేది
శారద : పాత కల్చర్‌లో పెద్దలపై గౌరవం కనిపించేది. అయితే ఇప్పుడు అది లేదు. పిల్లలకు సంస్కృతి నేర్పే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి.
 
 
పంచాయతన క్షేత్రంలో ‘ఊర్వశి’
మందలపర్రు (నిడమర్రు):  మందలపర్రులో నిర్మాణంలో ఉన్న ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచాయతన క్షేత్రాన్ని అలనాటి నటి ఊర్వశి శారద సోమవారం సందర్శించారు. ద్వారకాతిరుమల నుంచి దిండి వెళుతూ మార్గమధ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించారు. చిన్న గ్రామంలో పెద్ద ఎత్తున ఆలయాన్ని నిర్మిస్తున్న గ్రామస్తులను అభినందించారు. తనకు భక్తిభావం ఎక్కువని, ధ్యానం అంటే ఇష్టమని చెప్పారు. నిర్మాణం పూర్తయిన తర్వాత మరలా ఇక్కడకు వస్తానన్నారు.

 

మరిన్ని వార్తలు