రెయిన్‌గన్లను ఉపయోగించండి

31 Aug, 2016 22:51 IST|Sakshi
రెయిన్‌గన్లను ఉపయోగించండి
పత్తికొండ: రైతులు రెయిన్‌గన్లను ఉపయోగించుకోలేకపోవడం వల్లే పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని కోతిరాళ్ల క్రాస్‌ రోడ్డులో జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ అధ్యక్షతన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారన్నారు. ఈ సమయంలో మహిళా రైతులు జోక్యం చేసుకుంటూ మాటలు వద్దు సార్‌.. చేతల్లో చూపించాలని కోరారు. మంత్రి కోరిక మేరకు కేశవయ్య అనే రైతు తన బాధలను ఏకరువు పెట్టారు.
 
నిజాలు చెప్పండి సార్‌
‘‘సార్‌.. నేను పందికోన గ్రామ రైతును. ఉల్లి పంట సాగు చేసినా. ఎకరాకు రూ.80వేల పెట్టుబడి అయింది. పక్కనే ఉన్నా హంద్రీనీవా నీళ్లు అందించలేని పరిస్థితి ఉంది. కష్టపడి పంట పండిస్తున్నా. ఇంతా చేస్తే.. మీరు కిలో రూ.6లతో కొనుగోలు చేస్తామంటారు. ఎట్లా గిట్టుబాటు అవుతాది.’’ అని రైతు కేశవయ్య వాపోయాడు. వెంటనే మంత్రి నీకు రుణమాఫీ అయిందా అంటూ ప్రశ్నించారు. నాకు రూ.55 వేల అప్పు ఉందని.. మాఫీ కాలేదని రైతు సమాధానం ఇచ్చాడు. అందుకు మంత్రి స్పందిస్తూ కొన్ని లోపాల వల్ల రాకపోయి ఉండొచ్చని సర్ది చెప్పారు. మాటలు చెప్పకండి సార్, చెప్పిన మాటల్లో నిజం ఉండాలని రైతు తిరిగి సమాధానమిచ్చాడు. తిరిగి మంత్రి స్పందిస్తూ.. సాక్షి విలేకరులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చెప్పింటే వచ్చావని గద్దించడంతో, ‘‘సార్‌ నేను రైతును.. మీరు అడుగుతుంటే నా బాధ చెప్పుతున్నా. నాకు ఎవ్వరూ చెప్పలేదని’’ రైతు చెప్పారు. ఇలా సంభాషణ సాగుతున్న సమయంలో రైతులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. నిలదీసిన రైతును సభ నుంచి దూరంగా పంపించేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు