తేలనున్న ‘కృష్ణా’ లెక్క!

22 Oct, 2015 00:16 IST|Sakshi
తేలనున్న ‘కృష్ణా’ లెక్క!

♦ నీటి వినియోగ వివరాలు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను కోరిన బోర్డు
♦ బేసిన్ నుంచి చిన్ననీటి వనరులకు మళ్లించిన జలాలపైనా దృష్టి
♦ నాగార్జునసాగర్ ఆర్నెల్ల లెక్కలను సమర్పించాలని ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో ఇరు రాష్ట్రాల నీటి వినియోగ లెక్కలు తేల్చేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు సిద్ధమైంది. వర్షాకాలం దాదాపుగా ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు బేసిన్‌లోకి వచ్చిన నీరు, ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలపై అంచనాకు రావాలని నిర్ణయించింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు కాలువల ద్వారా తరలించిన నీటి వివరాలను ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశిం చింది. ఇక కృష్ణా పరీవాహకంలోనే ఉత్పత్తయి, చిన్న నీటి వనరులకు మళ్లించిన జలాల డేటాను కూడా అందజేయాలని కోరింది.

 వివాదాలు రావొద్దనే..
 కృష్ణా నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలున్న విషయం తెలిసిందే. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఉన్నాయి. ఈ నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదు. బచావత్ అవార్డులోని క్లాజ్-15 మేరకు గుండుగుత్తగా జరిపిన కేటాయింపులను (ఎన్‌బ్లాక్ కేటాయింపులు) రాష్ట్ర సరిహద్దుల లోపల ఎక్కడైనా వాడుకోవచ్చని తెలంగాణ చెబుతోంది, ఆ మేరకే నీటిని వాడుకుంటోంది. అసలు కోయల్‌సాగర్ (3.90 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), జూరాల (17.84 టీఎంసీలు), చిన్న నీటి వనరులు (26.79 టీఎంసీలు), తాగునీటి అవసరాలు (2.40 టీఎంసీలు)సహా మరికొన్ని చిన్న ప్రాజెక్టులకు కలిపి 78 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి.

ప్రాజెక్టులు పూర్తికాని కారణంగా ఇందులో కేవలం 10 నుంచి 20 టీఎంసీలనే తెలంగాణ వినియోగించుకుంటోంది. మిగతా వాటా నీటిని రాష్ట్ర పరిధిలోని నాగార్జునసాగర్ నుంచి వినియోగించుకునే హక్కు తమకు ఉందని పేర్కొంటోంది. దీనిని తొలుత ఏపీ తీవ్రంగా వ్యతిరేకించినా... జూలైలో జరిగిన ఒప్పందం మేరకు గుండగుత్తగా ఎక్కడైనా వాడుకునేందుకు అంగీకరించింది. అయితే ఈ విధానం కేవలం ఆ ఒక్క వాటర్ ఇయర్ (అక్టోబర్ వరకు) ముగిసేదాకానే పరిమితమని... తదుపరి దీనిపై చర్చిద్దామని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సాగర్‌లో నీటి వినియోగ వివరాలు, గత రెండేళ్లలో చిన్న నీటి వనరుల కింద జలాల వినియోగ వివరాలను కోరింది. ముందు ముందు ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదనే ఈ డేటాను కోరినట్లు తెలియజేసింది.

 ఈ ఏడాది తక్కువే..
 కృష్ణా బేసిన్‌లోని కే7, కే10, కే11, కే12 సబ్ బేసిన్ల పరిధిలో ఉన్న చిన్న నీటి వనరుల కింద రాష్ట్రానికి సుమారు 97 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఇవన్నీ పరీవాహకంలో కురిసే వర్షాలతో ఏర్పడే ప్రవాహాలే. గతేడాది చిన్ననీటి వనరులకు సుమారు 60 టీఎంసీల మేర ప్రవాహాలు వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇవే బేసిన్లలో ఏపీలో మరో 8 టీఎంసీల వరకు నీరు చేరింది. అయితే ఈ ఏడాది మాత్రం వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా చిన్న నీటి వనరుల కింద వచ్చిన నీరు 15 నుంచి 20 టీఎంసీలను మించదని అధికారులు చెబుతున్నారు. ఇక నాగార్జునసాగర్‌లోకి ఈ సీజన్‌లో వచ్చిన మొత్తం జలాలు 10 టీఎంసీలను మించలేదు. ఈ నీరంతా తాగు అవసరాలకే సరిపోగా.. సాగుకు నీరు అన్న మాటే లేదు. కేవలం శ్రీశైలానికి మాత్రమే 60 టీఎంసీల నీరు వచ్చింది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు కోరినప్పుడల్లా అవసరాన్ని బట్టి విడుదలకు అనుమతిస్తోంది. ఇటీవలే 7 టీఎంసీలు ఏపీకి, 2 టీఎంసీలు నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు కేటాయించింది.

మరిన్ని వార్తలు