వర్షించని తుపాకీ

9 Sep, 2016 23:41 IST|Sakshi
గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో నీరు లేక ఎండిపోతున్న వరి పంట
ఉత్సవ విగ్రహాల్లా రెయిన్‌గన్‌లు
సెంటు భూమికైనా నీరందని వైనం 
పంటలు ఎండిపోతున్నా పట్టని ప్రభుత్వం
ఆర్భాటమే తప్ప ఆచరణ శూన్యం
 
విజయనగరంఫోర్ట్‌: రాష్ట్రంలో ఏ రైతు పంటలనూ ఎండిపోనివ్వం... రెయిన్‌గన్‌లు తెస్తాం... ఆధునిక టెక్నాలజీతో పంటలు రక్షించుకుందాం... ఇందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తాం... రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. ఇదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్భాటంగా చేసిన ప్రకటన. జిల్లాకు వచ్చిన రెయిన్‌గన్లు ఎక్కడున్నాయో ఎవరీ అంతుచిక్కడంలేదు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నా... వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదు సెంట్లకయినా... తడులు అందివ్వలేని దుస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. రాష్ట్రంలో రెయిన్‌గన్ల ద్వారా 5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. మిగతా జిల్లాల్లో ఏవిధంగా ఉన్నా గానీ జిల్లాలో మాత్రం ఒక్క సెంటు భూమికైనా ఇంతవరకు నీరు అందించలేదు. జిల్లాకు 62 రెయిన్‌గన్‌లు సరఫరా అయ్యాయి. వీటిని ఆయా మండల వ్యవసాయ అధికారి కార్యాలయాలకు పంపించారు. కొన్ని మండలాలకు రెండు,  కొన్ని మండలాలకు ఒకటి చొప్పన కేటాయించారు. 
 
 
రైతులకందని గన్‌లు
జిల్లాకు రెయిన్‌గన్లు వచ్చాయి. కాని వాటిని రైతులకు ఇంతవరకు అందించలేదు. వాటిని ఏవిధంగా అందించాలన్న విషయంపైన కూడ ఇంతవరకు రైతులకు అవగాహన లేదు. జిల్లాలో వరి పంట91,385 హెక్టార్లలోను, చెరుకు 13,133 హెక్టార్లు, నువ్వులు 9930 హెక్టార్లు, మొక్కజొన్న 15,997 హెక్టార్లు, పత్తి 12,062 హెక్టార్లు, వేరుశనగ 12062 హెక్టార్లు, గోగు 3080 హెక్టార్లు, చోడి 1470 హెక్టార్లు, కంది 1043 హెక్టార్లు, మినుము 454 హెక్టార్లు, పెసర 375 హెక్టార్లు, మిరప 178 హెక్టార్లలో సాగవుతునానయి. ఇందులో ప్రధాన పంట వరి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆ పంటను ఏమాత్రం ఆదుకోవడంలేదు. వీటిని ఆదుకోవడానికి రెయిన్‌ పనికిరాదు. 
 
 
ఎండిపోతున్న పంటలు
వర్షాలు సకాలంలో కురవని కారణంగా జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా వరి పంట నీరు లేక బీటలు వారుతోంది. పంటలు ఎండిపోతున్నా చెరువుల్లో, గుంతల్లో నీరు లేక రైతులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టు మిట్టుడుతున్నారు. చెరుకు, నువ్వు, చోడి, వేరుశనగ పంటలు కూడ నీరు లేక ఎండి పోతున్నాయి. దీనిపై వ్యవసాయశాఖ జేడీ లీలావతి వద్ద సాక్షి ప్రస్తావించగా రెయిన్‌గన్‌లు జిల్లాకు వచ్చాయని, వాటిని ఏవిధంగా వినియోగించాలనే దానిపై  రైతులకు ఒకటి రెండు రోజుల్లో అవగాహన కల్పిస్తామనీ వివరించారు.
 
>
మరిన్ని వార్తలు