మంత్రులు మాట మీద నిలబడరు

26 Nov, 2016 01:40 IST|Sakshi
మంత్రులు మాట మీద నిలబడరు
 హామీలు ఇచ్చి తప్పించుకుంటారు
 ఒప్పందాలకు తిలోదకాలు
 టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
 
 హన్మకొండ: టీఆర్‌ఎస్ మంత్రులు మాట మీద నిలబడరని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో చేపట్టిన విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు ఆయన శుక్రవారం సంఘీభావం తెలిపి మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శిం చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పి, అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని తూర్పారబట్టారు. విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ శాఖ మంత్రి ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందానికి తిలోదకాలు ఇవ్వడంతో విద్యుత్ ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. దీనికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యుత్ సంస్థల యాజమాన్యాలదే బాధ్యత అని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వీరి సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఆ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 30న వరంగల్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. 
 
 నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
 వరంగల్: ప్రపంచంలో మూడో ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను పెద్ద నోట్ల రద్దు చేసి నడ్డివిరిచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌కు వచ్చిన ఆయన డీసీసీ భవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని ప్రపంచంలోని పలువురు ప్రముఖ ఎకనామిస్టులు అన్నారని తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బ్లాక్ మనీ బయటకు తెస్తా అన్న మోదీ దేశానికి బ్లాక్ రోజులను తీసుకువచ్చారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా ఈ నెల 28న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిందని, అన్ని జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నారుుని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు