రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం

13 Sep, 2016 02:11 IST|Sakshi
మల్లన్నసాగర్ పోరాట సంఘీభావ సభలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. వేదికపై కాంగ్రెస్ నేతలు

మల్లన్నసాగర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
గజ్వేల్: మల్లన్నసాగర్ వ్యవహారంపై ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, సుప్రీంకోర్టుకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ముందుగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్  చేసిన మల్లన్నసాగర్ ప్రాజెక్టును 50 టీఎంసీలకు పెంచి ఇష్టారాజ్యంగా భూసేకరణ చేపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలను పరిశీలించి, సాంకేతిక నిపుణులతోనూ అధ్యయనం జరిపించిన తర్వాత మల్లన్నసాగర్ సామర్థ్యం తగ్గించాలని కోరామని, అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా గోదావరి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లన్నసాగర్‌కు ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకువస్తున్నారని విమర్శించారు. మెదక్ జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో మల్లన్నసాగర్ భూనిర్వాసితుల దీక్షలు వందోరోజుకు చేరిన సందర్భంగా సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో భూబాధితుల పోరాట సంఘీభావ సభ నిర్వహించారు. ఇందులో ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. ‘‘ఆదిలాబాద్ జిల్లాలోని తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టి 160 టీఎంసీల నీటితో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.

ఇందుకు రూ. 38 వేల కోట్లు మాత్రమే ఖర్చవుతాయని గతంలో నిర్ణరుుంచారు. ఇందులో భాగంగానే మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీలుగా నిర్ధారించారు. ఆ సామర్థ్యంతో కడితే మల్లన్నసాగర్ వల్ల ముంపు 1,500 ఎకరాలే. కానీ ‘రీ-డిజైనింగ్’ పేరుతో కమీషన్లను పొందేందుకు తమ్మిడిహెట్టి నుంచి ఈ ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించి అంచనాలను రూ.38 వేల కోట్ల నుంచి రూ.83 వేల కోట్లకు పెంచారు’’ అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఆయకట్టు పెరిగిందంటూ కాకిలెక్కలు చెబుతున్నారని, ఇదంతా బోగస్ అని పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో ప్రాజెక్టు డీపీఆర్‌ను వెబ్‌సైట్లో ఉంచాలని డిమాండ్ చేశారు.

 కోటి ఎకరాలకు నీళ్లు.. ఒట్టి బూటకం
తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం జరిగితే మహారాష్ట్రలో ముంపు 3 వేల ఎకరాలు మాత్రమేనని ఉత్తమ్ పేర్కొన్నారు. అక్కడ 3 వేల ఎకరాలు ముంపు లేకుండా చేయడానికి తెలంగాణలో మాత్రం లక్ష ఎకరాలను ముంచడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై రూ.50 వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ప్రభుత్వం పదేపదే చెబుతున్న కోటి ఎకరాలకు సాగునీరు ఒట్టి బూటకమని, అవన్నీ కాకి లెక్కలని పేర్కొన్నారు. ఏడాదికి 2, 3 పంటలు పండే భూములు తీసుకుని ఆ భూముల్లో ప్రాజెక్టులు కట్టి వాటి ద్వారా ఒక పంటకు నీళ్లిస్తామని చెప్పడం తుగ్లక్ పరిపాలన కాదా? అని ప్రశ్నించారు.

మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వేములఘాట్ లో 50 రోజులుగా 144 సెక్షన్ విధించడం దారుణమన్నారు. ప్రభుత్వం తీరు చూస్తే మనం పాకిస్థాన్‌లో ఉన్నామా? కశ్మీర్‌లో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందన్నారు. మల్లన్నసాగర్‌కు 50 టీఎంసీల సామర్థ్యం అవసరమే లేదని, 1.5 టీఎంసీల సామర్థ్యం చాలన్నారు. ఇటీవల లాఠీచార్జి, గాల్లో కాల్పుల ఘటనలో 163 మంది గాయపడితే ప్రభుత్వం తరపున ఎవరూ పరామర్శించలేదన్నారు. కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి మృతికి కారణమైన సిద్దిపేట డీఎస్పీని సస్పెండ్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

మూడింతల పరిహారం ఇవ్వాలి
సభలో కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ... 2013 భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్నసాగర్ నిర్వాసితుల భూములకు మార్కెట్ ధరకు మూడింతల పరిహారం చెల్లించాలన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని, సొంతింటిని చక్కదిద్దుకోలేనివారు ఇక రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారని మాజీ మంత్రి డీకే అరుణ ఎద్దేవా చేశారు. సభలో పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, సునీతా లక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ విజయరామారావు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, కోదండరెడ్డి, శ్రీధర్‌బాబు, సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ప్రజ్ఞాపూర్ నుంచి నాలుగు కిలోమీటర్ల పొడవునా గజ్వేల్‌లోని సభా

నిర్వాసితుల హక్కులు కాపాడండి గవర్నర్‌కు టీపీసీసీ నేతల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్  భూనిర్వాసితుల హక్కులు కాపాడాలంటూ గవర్నర్ నరసింహన్‌కు టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. భూసేకరణ పేరిట రైతుల నుంచి భూములు లాక్కొని ప్రభుత్వం బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటోందని ఫిర్యాదు చేశారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని నిర్వాసితులు పోరాడుతుంటే ప్రభుత్వం నిర్బంధం విధిస్తోందన్నారు. జీవనోపాధి చూపించాలన్నందుకు నిర్వాసితులపై అక్రమ కేసులు బనాయించి, పోలీసులతో వేధిస్తున్నారన్నారు. పోలీసులు అమానవీయంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా