ఉన్నత విలువలతోనే ఉత్తమ పౌరులు

7 Feb, 2017 23:00 IST|Sakshi
ఉన్నత విలువలతోనే ఉత్తమ పౌరులు
ఎనిమిదేళ్ల కాలంలో 17 బదిలీలు ఎదుర్కొన్నాను
సదస్సులో ఉత్తరాఖండ్‌ కలెక్టర్‌ శ్రీధర్‌బాబు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : పిల్లల్లో నిజాయితీ, మానవీయ విలువలు కోల్పోకుండా పెంచితే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, తాను ఆ బాటలో నడిచినందునే తన ఎనిమిదేళ్ల కాలంలో 17 బదిలీలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగానని ఉత్తరాఖండ్‌ కలెక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు అన్నారు. మోరంపూడి సమీపంలోని నామవరం రోడ్డులోనున్న బార్లపూడి కళ్యాణ మండపంలో శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్‌ ఆధ్వర్యంలో ‘తల్లుల సదస్సు’ (ఎయిమ్స్‌) మంగళవారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్వీయ గౌరవం, సమగ్రత అనే రెండు మానవీయ విలువలు పిల్లల్లో పెంపొందించి రాజీపడకుండా జీవించేటట్లుగా పెంచాలన్నారు. అప్పుడే వారు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారన్నారు. తన బదిలీల్లో అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయన్నారు. గ్లోబల్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ కేఎస్‌.రత్నాకర్‌ మాట్లాడుతూ బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించే పిల్లలపై తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరో అతిథి, ప్రముఖ సైకాలజిస్ట్‌ పి.స్వాతి మాట్లాడుతూ పిల్లలతో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాస్త్రీయ కారణాలను వివరించారు. విద్యాసంస్థల చైర్మన్‌ తంబాబత్తుల శ్రీధర్‌ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత విలువలు గల పౌరులుగా తీర్చిదిద్దాలంటే మాతృమూర్తుల సహకారం అవసరమన్నారు. ఈ సదస్సును ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తున్నామన్నారు. విద్యాసంస్థల డైరక్టర్‌ టి.శ్రీవిద్య, టి.పాలేశ్వరరావు, టి.నాగమణి పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు