‘వార్దా’వరణం

12 Dec, 2016 14:24 IST|Sakshi
‘వార్దా’వరణం
  • ఉగ్రరూపమెత్తిన కడలి  
  • ఉప్పాడ తీరంపై విరుచుకుపడుతున్న అలలు
  • ధ్వంసమవుతున్న బీచ్‌రోడ్డు  
  • అన్నదాతల కలవరం
  • చి‘వరి’లో నష్టం తప్పదేమోనని ఆందోళన 
  • పిఠాపురం :
    వార్దా తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. బలమైన ఈదురుగాలులకు తోడు అత్యంత వేగంగా దూసుకువస్తున్న కెరటాల తాకిడికి ఉప్పాడ సాగరతీరం ముక్కలవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో బలంగా నిర్మించిన జియో ట్యూబ్‌ రక్షణ గోడను సైతం చిన్నాభిన్నం చేస్తూ.. గ్రామంలోని మత్స్యకారుల ఇళ్లపై అలలు విరుచుకుపడుతున్నాయి. సుమారు 6 మీటర్ల ఎత్తున ఎగసి పడుతున్న కెరటాల తాకిడితో ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డు ధ్వంసమవుతోంది. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణికులు ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రయాణిస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో తీరం వెంబడి కొత్తపల్లి పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రికి బీచ్‌రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు.
    సముద్రంలోనే ఉన్న బోట్లు?
    కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన పలు బోట్లు ప్రస్తుతం తీరానికి దూరంగా సముద్రంలో చేపల వేటలో ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో వెంటనే ఒడ్డుకు వచ్చేయాలంటూ ఆ బోట్లపై ఉన్న మత్స్యకారులకు వారి కుటుంబ సభ్యులు సెల్‌ ఫోన్ల ద్వారా సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బోట్లు వివిధ ప్రాంతాల్లో ఒడ్డుకు చేరుకుంటున్నాయని వారు చెబుతున్నారు. కొన్ని బోట్లలో ఉన్న మత్స్యకారుల సెల్‌ ఫోన్లు పని చేయకపోవడంతో వారికి సమీపంలోని బోట్లలో ఉన్న మత్స్యకారుల ద్వారా సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, సముద్రంలో ఎవరూ లేరని, సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లూ తీరానికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఎన్ని బోట్లపై చేపల వేటకు వెళ్లారు? ఎక్కడ ఉన్నారనే విషయాలపై మత్స్యశాఖ అధికారులు దృష్టి సారించారు. మండల అధికారులు గ్రామాల్లో సమాచారం సేకరిస్తున్నారు. సముద్రంలో ఉన్నవారికి వీహెచ్‌ఎఫ్‌ సెట్ల ద్వారా సమాచారం అందించి, వారు తీరానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
    ప్రమాదాన్ని లెక్క చేయకుండా..
    ఓపక్క కెరటాలు అత్యంత ప్రమాదకరంగా విరుచుకుపడుతున్న సమయంలో కూడా కొందరు తమ సెల్‌ఫోన్లకు పని చెప్పారు. ప్రమాదకర పరిస్థిల్లో రక్షణ గోడలపై నిలబడి సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. వారిని అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది.
    అమలాపురం :
    ఈశాన్యం కరుణించడంతో ఒడ్డున పడ్డామని సంతోషంగా ఉన్న ఖరీఫ్‌ రైతులను వార్దా తుపాను భయపెడుతోంది. దీని ప్రభావం జిల్లా మీద కూడా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడం రైతులను కలవరానికి గురి చేస్తోంది. ఈ నెల రెండో తేదీన నాడా తుపాను ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని వరి రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ గండం గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకుని కోతలు ముమ్మరం చేశారు. తీరా ఇప్పుడు వార్దా తుపాను రావడం వారిని మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్‌ కోతలు దాదాపు పూర్తి కావస్తున్నా.. తీరప్రాంత మండలాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తూర్పు డెల్టా పరిధిలోని కరప, కాకినాడ, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం సబ్‌ డివిజన్ల పరిధిలో సుమారు 60 వేల ఎకరాల్లో ఇంకా వరి కోతలు జరగాల్సి ఉంది. సాగు ఆలస్యం కావడంవల్ల ఇక్కడి పంటలు ఇప్పుడు కోతలకు వచ్చాయి. మరో 20 వేల ఎకరాల్లో పంట పనల మీద ఉంది.
    పెద్ద నోట్ల రద్దువల్ల కూలీలకు సొమ్ములు సర్దలేక చాలామంది రైతులు కోత కోసిన పనలను, నూర్పిళ్ల తరువాత ధాన్యాన్ని చేలల్లోను, కళ్లాలోను ఉంచేశారు. నోట్ల రద్దు వల్ల అటు అమ్మకాలు కూడా లేకపోవడంతో ధాన్యం కళ్లాలను వీడడం లేదు. ఈ సమయంలో వార్దా తుపాను వల్ల భారీ వర్షాలు కురిస్తే పంట నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రాశులు, పనల మీద బరకాలు కప్పి ఒబ్బిడి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చేలల్లో పనలను గట్ల మీదకు తరలిస్తున్నారు. మరో వారం, పది రోజులు వాతావరణం సహకరిస్తే గట్టెక్కుతామని, జిల్లాలో తుపాను ప్రభావం లేకుండా చూడాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. వార్దా తుపాను నేపథ్యంలో పనలమీద, కళ్లాల్లో ధాన్యం ఉంచుకున్న రైతులను అప్రమత్తం చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు కేఎస్‌వీ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.
    ఆక్వాపైనా ప్రభావం
    వరి రైతులతోపాటు ఆక్వా రైతులను సైతం వార్దా తుపాను ఆందోళనకు గురి చేస్తోంది. వైరస్‌ వల్ల పోయినంత పోగా, చాలా తక్కువ విస్తీర్ణంలో ఆక్వా రెండు, మూడు పంటలు ఉన్నాయి. ఇవి కొంత ఆశాజనకంగా ఉండగా తుపాను వల్ల భారీ వర్షాలు కురిసి వాతావరణం మరింత చల్లబడితే తమకు నష్టం తప్పదని ఆక్వా రైతులు అంటున్నారు.
     
     
    తీవ్ర తుపాను
    ‘వార్దా’ ప్రభావంతో ‘తూర్పు’ తీరం వణుకుతోంది. అది తీరం దాటేది దక్షిణ కోస్తాలోనే అని చెబుతున్నప్పటికీ.. దాని ప్రభావంతో ఎగసి పడుతున్న అలలతో కడలి ఉగ్రరూపం దాల్చింది. విరుచుకుపడుతున్న అలలతో ఉప్పాడ తీరం ముక్కలవుతోంది. మరోపక్క ఆదివారం ఉదయం నుంచి వీస్తున్న ఈదురుగాలులతో కోతకు వచ్చిన వరిచేలు నేలకు ఒరిగిపోయే పరిస్థితి నెలకొంది. దీనికి వర్షాలు కూడా తోడైతే ఈ ఏడాది కూడా పంట నష్టం తప్పదని అన్నదాతలు కలవరపడుతున్నారు.
     
    అధికారయంత్రాంగం అప్రమత్తం
    కాకినాడ సిటీ : వార్దా తుపాను ప్రభావం జిల్లాపై అంతగా ఉండనప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. క్షేత్రస్థాయిలో ప్రధానంగా తీరప్రాంత మండలాల్లో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇప్పటికే నియమితులైన ప్రత్యేకాధికారులు ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్తగా పౌరసరఫరాల శాఖ నిత్యావసర సరుకులను మండల స్థాయి స్టాక్‌ పాయింట్లలో సిద్ధంగా ఉంచింది. కాకినాడ పోర్టులో జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
     
మరిన్ని వార్తలు