వెంకన్న వేడుక..కన్నులకు కానుక

14 Oct, 2016 22:24 IST|Sakshi
  • భక్తజనం మురిసేలా బ్రహ్మోత్సవాలు
  • మూడోరోజు రాముని అవతారంలో స్వామి
  • హనుమత్, గరుడ వాహనాలపై ఊరేగింపు
  • మహిమ గల దేవునికి సుమాభిషేకం
  •  
    వాడపల్లి(ఆత్రేయపురం):
    ‘కోనసీమ తిరుపతి’గా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం స్వామి వారికి పుష్పాభిషేకంతో పాటు హనుమద్వాహన, గరుడ వాహన సేవ తదితర కార్యక్రమాలు భక్తజనులకు కన్నులవిందుగా జరిగాయి. స్వామివారికి ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ అనంతరం తీర్థపు బిందెతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. గోత్రనామాలతో పూజలు, నిత్యహోమాలు జరిగాయి. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థప్రసాద వినియోగం చేశారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పువ్వులతో అలంకరించారు. వజ్ర వైఢూర్యాభరణాలతో అలంకృతుడైన వెంకన్నను చూసి భక్తులు పులకించారు. ఆలయంలో భక్తులు ఆర్జిత సేవలు నిర్వహించారు. 
    ఉదయం వసంతోత్సవం, నిత్యహోమం, పుష్పయాగం, నీరాజన మంత్రపుష్పం, బలిహరణ అనంతరం 10 గంటలకు స్వామి వారికి శ్రీరాముని రూపంలో హనుమద్వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు  గరుడవాహన సేవ, స్వస్తి వచనం, నిత్యహోమం, నవమూర్తి అర్చన, అష్టోత్తర కలశారాధన, శయ్యాధివాసం, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు రాధాకృష్ణ, సాయిరామ్, శివ, నరీన్‌ చక్రవర్తి పర్యవేక్షించారు. కాగా శనివారం స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఏడువారాల నోము అచరించే భక్తులతోపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు కావడంతో  అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. 
    ఇవీ నేటి కార్యక్రమాలు 
    బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు విశేష నదీ జలంతో పూర్ణాభిషేకం, అష్టోత్తర శతకలశాభిషేకం, ఉదయం 10 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం 4 గంటలకు చంద్రప్రభ వాహన సేవ, సహస్ర దీపాలంకరణ, విశేష పూజలు, సేవలు జరుగుతాయి. 
     
మరిన్ని వార్తలు