ఘనంగా చక్రస్నానం

11 Apr, 2017 22:47 IST|Sakshi
ఘనంగా చక్రస్నానం
వాడపల్లి, ర్యాలి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వాడపల్లి (ఆత్రేయపురం) : వాడపల్లి వేంకటేశ్వరస్వామి, పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామి చక్రస్నాన మహోత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి  విష్వక్సేనపూజ, పుణ్యహవచనం, పూర్ణాహుతి, బాలబోగం, ప్రసాదవినియోగం తదితర కార్యక్రమాలను వేదపండితులు, ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్‌ ఆధ్వర్యంలో అర్చక స్వాములు చోళ సంవాదాన్ని జరిపించారు. చక్రస్నానం సందర్భంగా స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామి వారిని ఆలయం నుంచి పల్లకీపై ఊరేగింపుగా గ్రామ పుర వీధులో బాణసంచాకాల్పుల నడుమ బ్యాండ్‌ మేళాలతో గౌతమీ గోదావరి వద్దకు తీసుకుని వచ్చి అక్కడ గోదావరి సమీపంలో ఏర్పాటు చేసిన  పూరి పాకలో  స్వామివార్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం స్వామి వారిని గౌతమీ గోదావరి వద్ద  వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం    నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కరుటూరి నరసింహరావు, ఆలయ ఈఓ బీహెచ్‌వీ రమణమూర్తి, ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు  ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
ర్యాలి శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి చక్రస్నానాన్ని స్థానిక అమలాపురం కాలువలో వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, పూర్ణాహుతి, బాలభోగం, ప్రసాదవినియోగం తదితర కార్యక్రమాలను వేదపండితులు, ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామి వారి చక్రస్నానం కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో వై. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఆయా ఆలయాల వద్ద జేమ్స్‌ రత్న ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందో బస్తు నిర్వహించారు.  
మరిన్ని వార్తలు