వలస పాలెం

23 Feb, 2014 03:24 IST|Sakshi

కొనకనమిట్ల, న్యూస్‌లైన్: కొనకనమిట్ల మండలం కాట్రగుంట పంచాయతీలోని వడ్డెపాలెంలో 50 కుటుంబాలు నివశిస్తున్నాయి. గ్రామ జనాభా 250 మంది ఉంటారు. ఊళ్లో చేసేందుకు పనులు లేక యువకులంతా బేల్దారి పనుల కోసం వలస వెళ్తుంటారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే ఊళ్లో ఉండి..మిగిలిన తొమ్మిది నెలలు వలస బాట పడతారు. అయిన వారిని, పొలాలను, ఇళ్లను వదిలిపెట్టి బతుకుదెరువు కోసం హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. వారితో పాటే భార్యా, పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. దీంతో ఊరంతా ఖాళీ అయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కేవలం మూడు కుటుంబాల్లో ఐదుగురు వృద్ధులు మాత్రమే అక్కడుంటున్నారు. ఇళ్లన్నీ తాళాలు వేసి, వీధుల్లో చెట్లుపెరిగి ఉన్నాయి. కొన్ని ఇళ్ల సమీపంలోనూ చెట్లు పెరిగి శిథిలావస్థకు చేరాయి. బేల్దారి పనులకు వెళ్లిన వారు ఏటా ఆగస్టు నెలలో కులదేవత పెద్దమ్మతల్లి జాతర కోసం స్వగ్రామాలకు చేరుకుంటారు. జాతర అనంతరం ఊళ్లో  మూడు నెలలపాటు ఉండి..తిరిగి పనుల కోసం వలసెళ్తుంటారు.  
 
 గ్రామంలోని కోటమ్మ అనే వృద్ధురాలిని ‘న్యూస్‌లైన్’ పలకరించగా..తన గోడు వెళ్లబోసుకుంది. ‘అయ్యా ఊళ్లో పనుల్లేవు. మా ముగ్గురు పిల్లలు బేల్దారి పనులకు వేరే ఊళ్లకు ఎళ్లారు. మా ఆయనకు వచ్చే పింఛను, జీవాలు అమ్ముకోని వచ్చిన దాంతో బతుకుతున్నాం’ అని చెప్పింది.  గేదెలు మేపుకుంటూ పాడి ద్వారా జీవనం సాగిస్తున్నామని వేముల పిచ్చమ్మ అనే వృద్ధులు తెలిపింది. మరో వృద్ధురాలు బత్తుల పిచ్చమ్మ ఆరోగ్యం బాగోలేక మంచంపట్టింది. దూరప్రాంతాలకు వలసెళ్లి పనులు చేయలేక ఇక్కడే ఇళ్లు కనిపెట్టుకుని ఉంటున్నట్లు చెప్పింది. అరకొర ఆదాయాలతో కుటుంబాలు గడవటమే కష్టంగా ఉందని..ఇల్లు కట్టుకునే స్థోమత లేక రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్నామని కోటమ్మ అనే వృద్ధురాలు తెలిపింది.
 

>
మరిన్ని వార్తలు