మంత్రులకు చుక్కెదురు

25 Jan, 2017 03:59 IST|Sakshi
మంత్రులకు చుక్కెదురు

హిరమండలం(పాతపట్నం) : అసలు సమస్యను పక్కనబెట్టి...కంటి తుడుపు చర్యలతో సరిపెట్టుకుంటే సహించేది లేదని వంశధార నిర్వాసితులు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్‌ కూన రవికుమా ర్, ఎంపీ కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కలమట వెంకటరమణలను నిలదీశారు. ప్రభుత్వం నిర్వాసితులకు మంజూరు చేసిన పరిహారం పంపిణీ కోసం వీరంతా కట్టుదిట్టమైన భద్రత మధ్య మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. పది నిమిషాల్లోనే ముగ్గురు నిర్వాసిత యువతకు చెక్కులు అందజేసి వెనుదిరిగారు. సభకు భీమవరం గ్రామానికి చెందిన నిర్వాసితులు మాత్రమే హాజరు కావడంతో మంత్రులు అవాక్కయ్యారు. మంత్రులు వస్తున్నారని తెలిసినా నిర్వాసిత గ్రామాల ప్రజ లు ఎవరూ రాలేదు. వచ్చిన వారు ప్రభుత్వ తీరుపై...మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ నెల 31లోగా సమస్య లు పరిష్కరిస్తామన్నారు.

కొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణమే రూ.190 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో నిర్వాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల మీరు మాపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మరోలా మాట్లాడడం ఏమిటని నిలదీశారు. ఉన్న ఊరిని, భూములను విడిచి వెళ్లేందుకు సిద్ధపడి త్యాగాలు చేస్తే మమ్మల్నే అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతుండగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు మీరు చేసిందేమటని వేదిక వద్దకు దూసుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో మంత్రులు మెళ్లగా అక్కడ నుంచి జారుకున్నారు.   కలెక్టర్‌ లక్ష్మీనరసింహం, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి,  జేసీ చక్రధరరావు, ఆర్డీవో గున్న య్య, భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌ గోవర్ధనరావు, తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ పాల్గొన్నారు.  

నెలాఖరు నాటికి యూత్‌ ప్యాకేజి
ఎల్‌.ఎన్‌.పేట/కొత్తూరు : వంశధార స్టేజ్‌–2, ఫేజ్‌–2 ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన యూత్‌ ప్యాకేజి చెక్కులు పంపిణీ ఒకటి రెండు రోజులు అటుఇటుగా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంగళవారం కొత్తూరు మండలం కృష్ణాపురం గ్రామంలో జరిగిన యూత్‌ ప్యాకేజీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. కార్యక్రమానికి విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు