వైభవోపేతంగా వరలక్ష్మీ వ్రతం

12 Aug, 2016 23:37 IST|Sakshi
లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తున్న వేదపండితులు
 
తిరుచానూరు/శ్రీకాళహస్తి :
చిత్తూరు జిల్లా తిరుచానూరులో కొలువుదీరిన లక్ష్మీ స్వరూపిణీ శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో, శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణపూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తిరుచానూరులో వెలసిన నిండు ముతై ్తదువైన అలివేలుమంగమ్మ చెంత వరలక్ష్మీవ్రతం నోచుకుంటే అమ్మవారు భక్తులకు సకల సిరిసందలు, దీర్ఘ సుమంగళి, ఆయురారోగ్యం ప్రసాదిస్తారని విశ్వాసం. ఇందులో భాగంగా ఉదయం 8గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా ఆస్థాన మండపంలోని వ్రతమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. 10గంటలకు పాంచరాత్య్ర ఆగమ  శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు కలశంలోకి వరలక్ష్మిని ఆవాహనం చేసి పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు వ్రత మహత్యాన్ని తెలిపే కథను ఆలయ అర్చకులు వినిపించారు. వరలక్ష్మి వ్రతం నోచుకోవడానికి అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. రాత్రి తిరువీధుల్లో స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు.
శ్రీకాళహస్తిలో..
 శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ వ్రతం నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందించింది.  శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయంలోని కల్యాణమండపంలో శుక్రవారం వెయ్యి మందికిపైగా మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకున్నారు. ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి సర్వాంగసుందరంగా అలంకరించి వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు.
 
 
 
మరిన్ని వార్తలు