వడివడిగా వర్జీనియా నాట్లు

24 Oct, 2016 22:04 IST|Sakshi
– జిల్లాలో 60 వేల ఎకరాల్లో సాగుకు శ్రీకారం
– లాభసాటిగా నారు వ్యాపారం
– ట్రే నారుకు మొగ్గుచూపుతున్న రైతులు
దేవరపల్లి : మెట్ట ప్రాంతంలో వర్జీనియా పొగాకు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వారం రోజుల నుంచి నాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 10 నుంచి రైతులు పొగాకు నాట్లు ప్రారంభించినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఆలస్యం చేశారు. ప్రస్తుతం రైతులంతా పొలాల్లో ఉండి పొగాకు నాట్లు వేసే పనిలో పడ్డారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో దాదాపు 10 మండలాల్లో సుమారు 60 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో మాత్రమే వర్జీనియా పొగాకు పండుతుంది. ఉత్తర ప్రాంత తేలిక నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పండించే పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. జింబాబ్వే, బ్రెజిల్‌ దేశాల్లో పండించే పొగాకుకు ఇక్కడ పండించే పొగాకు పోటీ ఇస్తుంది. 
ప్రధాన వాణిజ్యపంటగా సాగు
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా పొగాకును సాగు చేస్తున్నారు. సుమారు 50 సంవత్సరాలుగా  ఈ పంట సాగులో ఉంది. అంచలంచెలుగా పంట విస్తీర్ణం పెరిగింది. రైతులకు పొగాకు సాగు మొన్నటి వరకు లాభసాటిగా ఉండేది. రెండు సంవత్సరాలుగా పంటకు గిట్టుబాటు ధర పలకకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో సాగు విస్తీర్ణం తగ్గించారు. ఏటా సుమారు 12 వేల మంది రైతులు, సుమారు లక్షమంది కార్మికులు పొగాకు పంట ద్వారా ఉపాధి పొందుతున్నారు. అక్టోబర్‌ 10 నుంచి నవంబర్‌ 30 వరకు పొగాకు నాట్లు వేస్తారు. జనవరిలో ఆకు రెలుపులు మొదలై మార్చి వరకు క్యూరింగ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరిలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై సెప్టెంబర్‌ వరకు జరుగుతాయి. ఈ–వేలం విధానంలో పొగాకు కొనుగోళ్లు నిర్వహిస్తారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల్లో రైతులు పండించిన పొగాకును అమ్మకాలు జరుపుతారు. పొగాకు సాగుకు బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నాయి. బ్యారన్‌కు (3.5 ఎకరాలు) రూ.5 లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఇచ్చిన రుణాలకు బోర్డు గ్యారంటీ ఇస్తుంది. అమ్మిన పొగాకు అమ్మకాల నుంచి రుణాలను బ్యాంకులు తీసుకుని మిగిలిన సొమ్మును రైతులకు చెల్లించడం జరుగుతుంది. ఏ పంటకు ఇవ్వని విధంగా బ్యాంకులు పొగాకుకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పొగాకు పంట ద్వారా ఏటా సుమారు రూ.6,000 కోట్లు ఆదాయం వస్తుంది. జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో సుమారు రూ.900 కోట్ల వరకు పొగాకు విక్రయాలు జరుగుతాయి. 
లాభసాటిగా నారు వ్యాపారం
పొగాకు నాట్లు ఊపందుకోవడంతో నారుకు గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం పొగాకు నారు వ్యాపారం లాభసాటిగా ఉంది. ఎకరానికి సరిపడిన నారు (6,500) మొక్కలు రూ. 3,000 నుంచి రూ. 3,500 ధర పలుకుతోంది. ట్రేలలో పెంచిన నారు రూ. 6,000 వరకు పలుకుతుంది. ట్రే నారు ధడంగా ఉండడంతో పాటు చీడపీడలను తట్టుకుని దిగుబడులు పెరగడంతో రైతులు ఎక్కువగా ట్రే నారుకు మొగ్గుచూపుతున్నారు. ఎకరానికి 100 ట్రేలు నారు పడుతుందని బోర్డు అధికారులు తెలిపారు. పొగాకు నర్సరీల్లోని నారును అధికారులు పరిశీలించి రైతులకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దేవరపల్లి మండలం పలంట్లలో పొగాకు నారుమడులను వేలం నిర్వహణాధికారి వైవీ ప్రసాద్, బోర్డు సిబ్బంది పరిశీలించారు. గోపాలపురంలో వేసిన తోటలను వేలం నిర్వహణాధికారి టి.తల్పసాయి పరిశీలించారు. జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటివరకు సుమారు 12,000 ఎకరాల్లో పొగాకు నాట్లు వేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు 80 శాతం నాట్లు పూర్తవుతాయని బోర్డు అధికారులు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు