మంచి చిత్రానికి ప్రేక్షకాదరణ తథ్యం :వరుణ్‌తేజ్

29 Oct, 2015 09:24 IST|Sakshi
మంచి చిత్రానికి ప్రేక్షకాదరణ తథ్యం :వరుణ్‌తేజ్

గుంటూరు : మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పడూ ఆదరిస్తారనే విషయం కంచె చిత్రం విజయంతో నిరూపితమయిందని, అందుకు ప్రేక్షకులందరికీ రుణ పడి ఉంటానని కంచె చిత్ర కథానాయకుడు వరుణ్‌తేజ్ అన్నారు. కంచె చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ బుధవారం నగరానికి వచ్చింది. నగరంలోని పల్లవి ధియేటర్, సినీస్క్వేర్ ధియేటర్‌లలో యూనిట్ సభ్యులు ప్రేక్షకులు, అభిమానులను పలకరించారు.

అనంతరం అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కథ,నటనకే ప్రాధాన్యమిస్తాననని,నటుడిగా పేరు తెచ్చుకోవడానికే కృషి చేస్తానన్నారు. డ్యాన్స్‌లు తనకు ముఖ్యం కాదని కథలో అవసరమైతే డ్యాన్స్‌లు చేయడానికి తాను సిద్ధమేనన్నారు.
 
 సొంత జిల్లాలో ప్రేక్షకుల ఆదరణ చూద్దామని వచ్చా : క్రిష్
 దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ  తన సొంత జిల్లా గుంటూరులో ప్రేక్షకుల ఆదరణను ప్రత్యక్షంగా చూడటానికి వచ్చానన్నారు. మనుషుల మధ్య కులం,మతం పేరుతో ఏర్పడిన కంచెలను తొలగించి అందరూ మానవత్వమే మతంగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తీశామన్నారు. ఈ చిత్రాన్ని తాము అనుకున్న దాని కంటే ఎక్కువగా ఆదరించారని, తనకు డబ్బు,పేరు,తృప్తి లభించాయని సంతోషం వ్యక్తం చేశారు.

చిత్ర కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృత జ్ఞతలు తెలియజేశారు. సినీస్క్వేర్ ధియేటర్ యజమాని వడ్లమూడి అర్జున్, ఈవీవీ యువ కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి, చిత్ర డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు