ఘనంగా వరుణ యాగం

28 Aug, 2016 23:06 IST|Sakshi
ఘనంగా వరుణ యాగం
వాన కురవాలి.. సిరులు పొంగాలి
పాదగయ జలంలో కుక్కుటేశ్వరునికి అభిషేకం
వెయ్యి కలశాల నీటితో గర్భగుడి దిగ్బంధం
పిఠాపురం : రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరునికి సహస్రఘటాభిషేకం నిర్వహించారు. వేయి కలశాల నీటితో స్వామివారి గర్భాలయాన్ని నింపివేసి స్వామిని జలదిగ్బంధం చేశారు. కుక్కుటేశ్వరస్వామి ఆలయంతో పాటు సకలేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి, విశ్వేశ్వరస్వామి ఆలయాలలో సహస్రఘటాభిషేకాలు నిర్వహించారు. తొలుత వేదపండితులు  మట్టికలశాలకు శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. పాదగయ పుష్కరిణి చుట్టూ వేదమంత్రాలతో పూజలు నిర్వహించి కుక్కుటేశ్వరస్వామికి పాలాభిషేకం, అనంతరం జలాభిషేకం నిర్వహించారు. గర్భగుడిని పాదగయ జలంతో నింపివేసి శివలింగం పూర్తిగా మునిగేలా  జలదిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈఓ చందక దారబాబు పర్యవేక్షించారు. కాగా సామర్లకోట, ద్రాక్షారామ, అయినవిల్లి, తలుపులమ్మలోవ వంటి పుణ్యక్షేత్రాల్లోను వరుణయాగాలు జరిగాయి.
పంపాలో ఋష్యశృంగుని విగ్రహం నిమజ్జనం
అన్నవరం: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థిస్తూ రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన ఋష్యశృంగమహర్షి విగ్రహాన్ని ప్రతిషి్ఠంచి గత మూడు రోజులుగా నిర్వహించిన వరుణ జపాలు ఆదివారం ముగిశాయి. ఉదయం 8 గంటలకు  సత్యదేవుడు, అమ్మవారు, ఋష్యశృంగమహర్షికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పది గంటలకు వరుణ యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య  దేవస్థానం పండితులు,  ఈఓ నాగేశ్వరరావు హోమద్రవ్యాలను సమర్పించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవార్లు, ఋష్యశృంగమహర్షికి  పండితులు వేదాశీస్సులందచేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. మూడు రోజులు పూజలందుకున్న ఋష్యశృంగమహర్షి విగ్రహాన్ని వేదమంత్రాలు, మేళతాళాల మధ్య కొండదిగువన పంపా నదిలో నిమజ్జనం చేశారు. తొలుత రత్నగిరిపై పండితులు ఆ విగ్రహాన్ని శిరసున ధరించి ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షణ నిర్వహించారు. ప్రధాన వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠి,  ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు  తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి అన్నవరంలో వాతావరణం మేఘావృతమై వర్షం కురిసింది. ఇదంతా వరుణ యాగ మహిమేనని పండితులు చెప్పారు.
మరిన్ని వార్తలు