అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

29 Aug, 2017 22:26 IST|Sakshi

శింగనమల: అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని ఆకులేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భాస్కర్‌(38) 13ఏళ్ల క్రితం బుక్కరాయ సముద్రం మండలంలోని పసలూరు కొత్తపల్లి నుంచి బతుకుదెరువు కోసం ఆకులేడు చేరుకున్నాడు. భార్య రత్నమ్మతో కలిసి మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు, ఒక కుమారుడు సంతానం. అనంతపురం సహకార బ్యాంకులో గ్రామంలోని చేనేత కార్మికులంతా గ్రూపుగా ఏర్పడి రుణం తీసుకున్నారు. భాస్కర్‌ పేరిట రూ.50వేల రుణం ఉంది.

మగ్గం ముడి సరుకుల ధర పెరగడం, నేసిన చీరలకు గిట్టుబాటు ధర లేకపోవడం.. కుటుంబ పోషణకు లక్ష రూపాయలకు పైగా ప్రయివేట్‌ అప్పులు చేశాడు. అదేవిధంగా ఎనిమిది నెలల క్రితం పెద్ద కుమార్తె జానకి పెళ్లి కోసం మరో లక్ష రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. తనవద్దనున్న 4 తులాల బంగారు నగలు(రెండు చైన్లు, కమ్మలు, చెవి దిద్దులు) అదే గ్రామంలోని ఓ వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. గత నాలుగేళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఈ నేపథ్యంలో బయటపడే దారి లేక మంగళవారంఉదయం 6 గంటలకు గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గొర్రెల కాపరుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శింగనమల ఎస్‌ఐ హమీద్‌ఖాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు