‘పరిషత్‌’ పరీక్షలకు దేశవ్యాప్త గుర్తింపు

24 Aug, 2016 22:28 IST|Sakshi
‘పరిషత్‌’ పరీక్షలకు దేశవ్యాప్త గుర్తింపు
రాజమహేంద్రవరం కల్చరల్‌: వేదశాస్త్ర పరిషత్తు ఏటా నిర్వహించే వేదశాస్త్ర పరీక్షలకు దేశమంతటా గుర్తింపు ఉందని కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. బుధవారం ఇన్నీసుపేటలోని పరిషత్తు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1937లో కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతీ మహాస్వాముల ఆశీస్సులతో ప్రారంభమైన పరిషత్తు క్రమం తప్పకుండా ఏటా పరీక్షలు నిర్వహిస్తోందన్నారు.   ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలు బుధవారంతో ముగిశాయని, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. గురువారం ఉదయం పరిషత్తు కార్యాలయం నుంచి వేదవిద్యార్థులు వేదపారాయణతో టి.నగర్‌లోని విశ్వేశ్వరస్వామి ఆలయం, మెయిన్‌రోడ్డు మీదుగా మార్కండేయేశ్వరస్వామి ఆలయాన్ని చేరుకుంటారని, అక్కడ వేదపారాయణ నిర్వహిస్తారని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు దానవాయిపేట చిన్న గాంధీబొమ్మ వద్దగల వాడ్రేవు వారి ఇంటిలో మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగే వేదసభలో పరీక్షలలో ఉత్తీర్ణులయిన విద్యార్థులను, వేదపండితులను సత్కరిస్తామని తెలిపారు. పరిషత్తు కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో పరిషత్తు అధ్యక్షుడు వేలూరి రామచంద్ర, సహ కార్యదర్శి పీసపాటి సత్యనారాయణశాస్త్రి, కోశాధికారి వాడ్రేవు వేణుగోపాల్, సభ్యులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు