వెజిటబుల్‌ హబ్‌.. విలవిల

25 Sep, 2016 21:19 IST|Sakshi
గజ్వేల్‌లో వర్షాలకు దెబ్బతిన్న టమాట పంట

కూరగాయల పంటలకు వర్షం దెబ్బ
2,570 హెక్టార్లలో మునిగిన పంటలు
రూ.10 కోట్లకు పైగా నష్టం
పరిహారం కోసం రైతుల ఎదురుచూపు

గజ్వేల్: ‘వెజిటబుల్‌ హబ్‌’గా ఆవిర్భవించిన జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కూరగాయల పంటలకు మున్నెన్నడూలేని నష్టాన్ని కలగజేశాయి. ఇప్పటివరకు 2,570 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. నష్టం రూ.10కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా జిల్లాపై ఆధార పడ్డ హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూర్, చంద్లాపూర్‌ తదితర  మార్కెట్లకు గడ్డు రోజులు సంక్రమించనున్నాయి.

ఒకప్పుడు కూరగాయలు పండించాలంటే రైతులు జంకే పరిస్థితి. జిల్లా అంతటా ఈ పరిస్థితి ఉండేది. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్తే కనీసం రవాణా ఛార్జీలు సైతం గిట్టుబాటుకాని దుస్థితి. అన్ని చోట్లా దళారులు తిష్ట వేసి కారుచౌకగా  ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను నిలువు దోపిడీ చేసేవారు.

ఫలితంగా కూరగాయల పంటలను అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేసి తమ సొంత అవసరాలకు మాత్రమే వాడుకునేవారు. గత ఎనిమిదేళ్లల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. కూరగాయల సాగు ప్రస్తుతం వాణిజ్యపంటలకు ధీటుగా సాగుతున్నది. జిల్లాలో ప్రస్తుతం 60వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 20ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి.

మెతుకుసీమగా పేరుగాంచిన జిల్లాలో వరి సాగు తగ్గి కూరగాయల సాగు పెరుగుతున్నదంటే అతిశయోక్తి కాదు. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సోరకాయ, దొండ, సాధారణ విధానాల్లో టమాటా, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు, ఆకుకూరలు రైతులు సాగు చేస్తున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టి సారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి.

ఇందులో భాగంగానే గజ్వేల్‌ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకొని ఇక్కడ రిలియన్స్‌ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్స్‌, ఐటీసీ లాంటి మల్టీ నేషనల్‌ సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం కూరగాయల సాగు ప్రాధాన్యత స్పష్టమవుతున్నది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కే కాకుండా ఢిల్లీ, చంద్లాపూర్, బెంగళూర్‌ తదితర రాష్ట్రీయ మార్కెట్లకు కూడా కూరగాయలు ఎగుమతవుతుండటంతో ఈ ప్రాంతం ‘వెజిటబుల్‌ హబ్‌’గా ఆవిర్భవించింది.

గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తొగుట, నంగునూరు, సిద్దిపేట, దుబ్బాక, చిన్నకోడూరు, చేగుంట, దౌల్తాబాద్, శివ్వంపేట, నర్సాపూర్, జిన్నారం, సంగారెడ్డి తదితర మండలాల్లో కూరగాయల సాగు భారీగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో కొన్ని రోజులుగా కరుస్తున్న భారీ వర్షాలు కూరగాయల రైతుల ఆశలు అడియాశలు చేశాయి. ఎక్కడికక్కడా పంటలు చేలల్లోనే కుళ్లిపోయాయి. ఫలితంగా ఉత్పత్తులు పడిపోయి ఒక్కసారిగా హైదరాబాద్‌ సహా ఇతర రాష్ర్టీయ మార్కెట్లకు ఎగుమతులు పడిపోయాయి.

ఇదీ ఉదాహరణ
గజ్వేల్‌ పట్టణానికి చెందిన ఏలేశ్వరం బాలయ్య తనకున్న కొద్దిపాటి విస్తీర్ణంలో సుమారు 15వేల పెట్టుబడి పెట్టి టమాటా సాగు చేశాడు. ఇప్పటివరకు ఒక్క కాయ కూడా తెంపలేదు. చేతికందే సమయంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు పంట పూర్తిగా దెబ్బతినేలా చేశాయి. దీంతో ఆ రైతు ఆందోళన చెందుతున్నాడు.

నష్టంపై అంచనా వేస్తున్నాం
జిల్లాలో కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు 2,570 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తెలస్తోంది. నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిస్తాం. - రామలక్ష్మి, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు