దేవుడి సేవలో ఆనందం

16 Aug, 2016 22:53 IST|Sakshi
దేవుడి సేవలో ఆనందం
విజయవాడ(లబ్బీపేట) :
దేవుడి, సమాజ సేవలోనే ఆనందం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల, గృహనిర్మాణ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా స్వరాజ్య మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా ఏర్పాటు చేయగా, వారి ఆధ్వర్యంలో ప్రతి రోజూ లక్ష మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. అన్నప్రసాదానికి గాను నగరానికి చెందిన మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి ప్రతిరోజూ ఐదు టన్నుల కూరగాయలను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబరావు నేతృత్వంలో ఘన్‌సన్‌సార్‌ సంస్థ, అరవపల్లి ఆదిత్య, మండవ సస్య, మనీష్‌ అగర్వాల్, సతీష్‌ అగర్వాల్‌లు మంగళవారం ఐదు టన్నుల కూరగాయలను టీటీడీ శ్రీవారి అన్నప్రసాదానికి అందజేశారు. ఈ సందర్భంగా కూరగాయల లారీని బృందావనకాలనీలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద మంత్రి సునీత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత జెండా ఊపి ప్రారంభించారు. సునీత మాట్లాడుతూ డబ్బును సంపాదించే వారు చాలా మంది ఉంటారని, సంపాదన ఇతరులకు పెట్టే వారు తక్కువ మంది ఉంటారన్నారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ప్రస్తుత కృష్ణాపుష్కరాలో సేవలు చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారని, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వల్లూరు అశోక్, బీఏ నాగు, మండవ శ్రీనివాస్, నువ్వుల రాజేష్, మండవ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు