వాహనం ఆచూకీ.. ప్చ్‌!!

28 Aug, 2016 22:10 IST|Sakshi
వాహనం ఆచూకీ.. ప్చ్‌!!
* పోలీస్‌ వాహనాన్ని ఢీకొని పరారీ
* నుజ్జునుజ్జయిన వాహనం
* నాలుగు రోజులుగా అన్వేషణ
* పని చేయని సీసీ కెమెరాలు
తలలు పట్టుకుంటున్న పోలీసులు
 
కుంచనపల్లి (తాడేపల్లిరూరల్‌): తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌పై గత నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. నలుగురు ప్రయాణికులు మరణించడంతోపాటు ఓ హెడ్‌ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతోపాటు పోలీసు వాహనం కూడా పూర్తిగా ధ్వంసమవడంతో ఆ గుర్తు తెలియని వాహనం గుర్తించేందుకు పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. గత నాలుగు రోజుల నుండి కాజ టోల్‌ గేటు నుండి విజయవాడ చట్టుపక్కల ప్రాంతాలలో సీసీ కెమారా ఫుటేజిలను గమనించే పనిలో మంగళగిరి సీఐ హరికృష్ణ, తాడేపల్లి ఎస్‌ఐలు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 500 వాహనాలను పరిశీలించినా ఎటువంటి సమాచారం లభించకపోవడంతో పోలీసుల ఆశలు నిరాశలయ్యాయి.
 
పనిచేయని నిఘా నేత్రాలు..
రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కరెంటు పోవడంతో కనకదుర్గ వారధి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పని చేయలేదు. మంగళగిరి నుండి హైవే ప్రాంతం వరకు పుష్కరాల నిమిత్తం ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలు కూడా పనిచేయవడంతో ఇంటర్నల్‌ మొమరీ లేకపోవడంతో పోలీసులకు పని భారం పెరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి కనకదుర్గ వారధి వరకు ప్రై వేటు వ్యక్తుల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి సర్వీసు రోడ్డును మాత్రమే చూపించడం, ఆ సీసీ కెమెరాలు వద్ద జాతీయ రహదారి ఎత్తులో ఉండడంతో వాహనం ఆచూకీ దొరకలేదు. దీంతో కనకదుర్గ వారధి నుండి ప్రధాన రహదారుల అన్నింటిలోనూ సీసీ కెమారాలు ఎక్కడ ఉన్నాయని అధికారులు అన్వేషణ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంగతి అలా ఉంచితే, సహాయం చేయడానికి వెళ్లిన ఇద్దరు పోలీసులకు గాయాలు కావడం, పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసం కావడంతో రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మరిన్ని వార్తలు