వాహనచోదకులరా తస్మత్‌ జాగ్రత్త

24 Apr, 2017 00:21 IST|Sakshi
వాహనచోదకులరా తస్మత్‌ జాగ్రత్త
-రాంగ్‌రూట్‌లో వెళ్లినా..సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసినా ఈ చలానా జరిమాన
- త్వరలో కర్నూలులో అమలు
 – సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ 
కర్నూలు :  నిబంధనలకు విరుద్ధంగా రాంగ్‌రూట్‌లో వెళ్లే వాహన చోదకులకు ఈ చలానా జరిమానతో చెక్‌ పెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు కార్యచరణ రూపొందించారు. త్వరలో ఈ చలాన ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.   నగరంలోని సీసీ కెమెరాల కంట్రోల్‌ రూమ్, కమ్యూనికేషన్స్, ట్రాఫిక్‌ పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేసి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సూచించారు. ఆదివారం రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లోని సీసీ కెమెరాల కంట్రోల్‌ రూమును ఆయన పరిశీలించారు. నగరంలోని రద్దీస్థలాలు, రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ను కంట్రోల్‌ రూము నుంచి పరిశీలించారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, పరిమితికి మించి వాహనాల్లో వెళ్లడం వంటి వాటిని సీసీ కెమెరాల నుంచి ఫొటో క్యాప్షర్‌ చేసి, ఈచలానా ఫాం వాహనదారుని ఇంటికే పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. ఎంవీ యాక్ట్‌ ప్రకారం ఈచలానా జరిమాన రూ.300 నుంచి రూ.1000 వరకు ఉంటుందన్నారు. దూర ప్రాంతాల వారికి పోస్టల్‌లో ఈ చలానా వెళ్తుందన్నారు.
 
శివారు కాలనీల్లో కూడా ప్రజాభద్రతా చట్టం ప్రకారం సీసీ కెమెరాల వినియోగానికి అవగాహన కల్పిస్తామన్నారు.  ఎప్పటికప్పుడు పోలీసు  సిబ్బంది సీసీ కెమెరాల పుటేజీ నుంచి పర్యవేక్షించాలన్నారు. సీసీ కెమెరాల పనిలోపం ఎక్కడైనా ఉంటే   మున్సిపల్‌ అధికారులు బృహస్పతి టెక్నాలజీ వారితో చర్చించి సరిచేయాలన్నారు. నేరాల అదుపునకు, దర్యాప్తునకు సీసీ టీవీల పుటేజీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. డీఎస్పీలు రమణమూర్తి, బాబూప్రసాద్, సీఐలు డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, కృష్ణయ్య, నాగరాజరావు, నాగరాజుయాదవ్, శ్రీనివాసరావు, మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు