దేశం నేతలకు 'వెలగ'పోటు..!

11 Aug, 2016 10:58 IST|Sakshi
ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఎమ్మెల్యే వెలగపూడి

తమవారిని కాదని బీజేపీ నేతకు పదవి
కార్పొరేటర్ సీటు కోసం చైర్మన్ పదవి ఎర
తన స్వార్థం కోసం ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత వ్యూహం
పోలమాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు సాక్షిగా బయటపడ్డ విభేదాలు

విశాఖపట్నం : పదవి కోసం పచ్చ పార్టీ నేతలు ఎంతటి కుతంత్రాలకైనా ఒడిగడతారు... ఎలాంటి మోసాలకైనా సిద్ధపడతారు అనడానికి తాజా ఉదంతమే ఓ ఉదాహరణ. సొంత పార్టీలో ఎంతో కాలంగా ఆశలు పెంచుకున్న వారిని కాదని... స్వప్రయోజనాల కోసం బీజేపీ నేతకు పదవి కట్టబెట్టడం ఇప్పుడు టీడీపీలో చిచ్చురేపేతోంది.

రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ సీటుకు తనకెవరూ పోటీ ఉండకూడదనే స్వార్థంతో టీడీపీ 17వ వార్డు నేత  బైరెడ్డి పోతన్నరెడ్డి స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ప్రసన్నం చేసుకుని పోలమాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని అదే వార్డుకు చెందిన బీజేపీ నేత మరడ వెంకటరెడ్డికి కట్టబెట్టారు. ఎంతో కాలంగా ఆ పదవి కోసం ఆశలు పెంచుకున్న టీడీపీ మహిళా నేత వాకా సత్యవతికి వెన్నుపోటు పొడిచారు.
 
కార్పొరేటర్ సీటు కోసం స్కెచ్
 పద్నాలుగు గ్రామాల కల్పవల్లిగా భాసిల్లుతున్న పెదవాల్తేరు పోలమాంబ అమ్మవారి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో 14 గ్రామాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. అంటే ఎవరు చైర్మన్‌గా ఉంటే వారికి పద్నాలుగు గ్రామాలపై పట్టు ఉంటుంది. కనీసం ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా తన స్వార్థం కోసం పోతన్న రెడ్డి వ్యూహం రచించారు. దానికి ఎమ్మెల్యే వెలగపూడి కూడా మద్దతు పలకడంతో సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు.

జీవీఎంసీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీలు పొత్తుపెట్టుకుని బరిలో దిగే అవకాశం ఉందనే వార్తలు రావడంతో బీజేపీ 17వ వార్డు అధ్యక్షుడు వెంకటరెడ్డి కార్పొరేటర్ సీటు కోసం భారీ ఆశలే పెట్టుకున్నారు. దీంతో అధికార పార్టీలో సీనియర్ నేతగా చలామణి అవుతున్న బైరెడ్డి పోతన్నరెడ్డి తన వార్డులో బీజేపీ పోటీలో లేకుండా చేయాలని భావించారు. అనుకున్నదే తడువుగా ఎమ్మెల్యే అండతో వ్యూహం రచించి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని వెంకటరెడ్డికి ఎరగా వేశారు. వార్డులో మిత్రపక్షం నుంచి తనకు పోటీ లేకుండా చేసుకున్నారు.
 
భగ్గుమంటున్న టీడీపీ వర్గీయులు
ఎన్నాళ్లుగానో పోలమాంబ అమ్మవారి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా నియమాకం కావాలని ఆశించిన వాకా సత్యవతి సొంత పార్టీ నేత చేసిన కుట్రను, అందుకు ఎమ్మెల్యే వెగలపూడి మద్దతు తెలపడాన్ని భరించలేకపోతున్నారు. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా బీజేపీకి చెర్మైన్ పదవిని ఇచ్చేశారంటూ టీడీపీ వర్గీయులే దుమ్మెత్తిపోస్తున్నారు.

ఒక్క నేత లబ్ధి కోసం ఏకంగా 14గ్రామాలతో ముడిపడి ఉన్న పోలమాంబ అమ్మవారి ట్రస్టీ చైర్మన్ కట్టబెట్టడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో ఈ వార్డులో టీడీపీ రెండుగా చీలిపోయింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేయకూడదని, పెద్దల వద్దే తాడోపేడో తేల్చుకోవాలని మహిళా నేత భావిస్తున్నట్లు సమాచారం. జీవీఎంసీ ఎన్నికల ప్రకటన వెలువడక ముందే టీడీపీలో విభేదాలు ఈ స్థాయిలో ఉంటే భవిష్యత్‌లో ఇంకెన్ని పంచాయతీలు తెరపైకి వస్తాయోనని ఆ పార్టీ వారే కలవరపడుతున్నారు.

మరిన్ని వార్తలు