-

వెలి చిచ్చు

25 May, 2017 23:34 IST|Sakshi
వెలి చిచ్చు
తణుకు:  ఇరువర్గాల మధ్య తలెత్తిన పొలం తగాదా రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండేళ్లుగా రెండు కుటుం బాలను గ్రామస్తులు వెలి వేశారు. దీంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, మరో కుటుంబం భయంతో కాలం వెళ్లదీస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం టీడీపీ నేతలు తలదూర్చడంతో జటిలమైంది. వివరాలిలా ఉన్నాయి.. తణుకు మండలం మహాలక్షి్మచెరువు గ్రామానికి చెందిన గూడూరి కొండయ్య, గూడూరి శ్రీనివాస్‌లు అన్మదమ్ములు. మూడు దశాబ్దాలుగా ఈ గ్రామంలో కొద్దిపాటి పొలాన్ని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 2015లో పొలం పంచుకునే విషయంలో వివాదం తలెత్తింది. గ్రామ పెద్దలు రాజీ చేసేందుకు యత్నించారు. అయితే శ్రీనివాస్‌కు చెందాలి్సన పొలాన్ని ఆయన భార్య సత్యవతి పేరున రాయాలని ఆమె కుటుంబ సభ్యులతోపాటు గ్రామ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. దీనికి కొండయ్య, శ్రీనివాస్‌ నిరాకరించడంతో అదేరోజు రాత్రి గ్రామానికి చెందిన పది మంది వ్యక్తులు కొండయ్య, సూర్యావతి దంపతులపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. దీనిపై కొండయ్య దంపతులు తణుకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామస్తులపై ఫిర్యాదు చేసినందుకు గాను కొండయ్య, శ్రీనివాస్‌ కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేశారు. అనంతరం శ్రీనివాస్‌ భార్య సత్యవతి పుట్టింటికి వెళ్లిపోయింది. 
టీడీపీ నాయకుల హస్తం
కొండయ్య, శ్రీనివాస్‌ కుటుంబాలను వెలి వేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో గ్రామ సర్పంచ్‌ భర్త, మండల టీడీపీ అధ్యక్షుడు పితాని మోహనరావు కేసు ఉపసంహరించుకోవాలని పలుమార్లు తమపై ఒత్తిడి తీసుకువచ్చారని కన్నీటì æపర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా కొండయ్య దంపతులు పెట్టిన కేసుకు ప్రతిగా కొండయ్య తండ్రి చినవీరన్నతో గ్రామ పెద్దలు మరో కేసు పెట్టించారు. చినవీరన్న భార్యపై కొండయ్య, శ్రీనివాస్‌ దాడి చేసి ఆమె మెడలోని మంగళసూత్రం తెంచుకుపోయారని కేసు బనాయించారు. ఈ కేసు విషయమై పిలిచేందుకు కానిస్టేబుల్‌ ఇంటికి రావడంతో మనస్తాపం చెందిన కొండయ్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడిని ఆçస్పత్రిలో చేర్చి చికిత్స చేయించిన అనంతరం అతనిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేసి 15 రోజులపాటు రిమాండ్‌కు తరలించారు. అలాగే శ్రీనివాస్‌ భార్య సత్యవతితో కూడా గ్రామపెద్దలు కట్నం వేధింపుల కేసు పెట్టించారు. అయితే కొండయ్య దంపతులు గ్రామ పెద్దలపై పెట్టిన కేసును కొట్టేయడంతో గతేడాది నవంబర్‌ 22న కోర్టులో మరోసారి ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కోళ్ల ఏడుకొండలు, పాల ఏడుకొండలు, పాలా శ్రీను, కండిబోయిన సత్తిబాబు, కండిబోయిన ఏడుకొండలు, కండిబోయిన దానయ్య, కండిబోయిన శివ, కండిబోయిన బాలాజీ, కండిబోయిన వీరన్న, పాలా శ్రీనివాసుపై కొండయ్య దంపతులు  ఫిర్యాదు చేశారు.
 
శ్రీనివాస్‌ ఆత్మహత్య
వెలి వేసినప్పటి నుంచి కొండయ్య, శ్రీనివాస్‌ కుటుంబాలు పలు ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామంలోని దుకాణాల్లో కిరాణా సరుకులు కూడా ఇవ్వకపోగా ఈ కుటుంబాలతో ఎవరూ మాట్లడకూడదని మైక్‌ ద్వారా కూడా ప్రచారం చేయించారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన శ్రీనివాస్‌ ఈ ఏడాది మార్చి 25న పురుగు మందు తాగాడు. బాధితుడిని 108లో తరలించడానికి కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు శ్రీనివాస్‌ మృతి చెందాడు. మృతదేహాన్ని చూసేందుకు, కనీసం కుటుంబ సభ్యులను పలకరిం చేందుకు సైతం ఎవరినీ రాకుండా పెద్దలు అడ్డుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉంటున్న కొండయ్య దంపతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఇటీవల కేబుల్‌ కనెక్షన్‌ తొలగించడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి పునరుద్ధరించారు. మరోవైపు విద్యుత్‌ కనెక్షన్‌ కూడా తొలగించేందుకు విద్యుత్‌శాఖ సిబ్బంది ప్రయత్నించారు. పొలంలో పనులు చేసే కూలీలను కూడా అడ్డుకుంటున్నారని వీరు ఆవేదన చెందుతున్నారు. రూ.లక్ష జరిమానా చెల్లించి తప్పు ఒప్పుకోవాలని తమపై పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. 
 
గ్రామ పెద్దలే కారణం
మా కుటుంబాలకు జరి గింది అన్యాయమని గ్రా మమంతా తెలిసినా ఎవ్వరూ మాకు న్యా యం చేయడం లేదు. గ్రామ పెద్దల కారణంగానే నా సోదరుడు శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను కూడా ఆత్మహత్యకు యత్నించాను. పోలీసులకు కూడా మాకు జరిగింది అన్యాయమని తెలుసు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. 
– గూడూరి కొండయ్య, బాధితుడు, మహాలక్షి్మచెరువు 
 
రెండేళ్లుగా వెలిలోనే..
మాపై దాడి చేసిన గ్రామ పెద్దలు తిరిగి మాపై అక్రమ కేసులు బనాయించి గ్రామంలో వెలి వేశారు. రెండేళ్లుగా వెలిలోనే బతుకుతున్నాం. పెద్దల మాట వినలేదని, వీరి తీర్పునకు కట్టుబడలేదని మమ్మల్ని వెలి వేశారు. మానవ హక్కుల కమిషన్‌కు మొర పెట్టుకున్నా న్యాయం జరగడం లేదు. 
– గూడూరి సూర్యావతి, బాధితురాలు, మహాలక్షి్మచెరువు
 
మరిన్ని వార్తలు