రేపు వెనిగళ్ల శ్రీకాంత్ లొంగుబాటు!

5 Jun, 2016 09:32 IST|Sakshi
రేపు వెనిగళ్ల శ్రీకాంత్ లొంగుబాటు!
  • రంగంలోకి టీడీపీ నేతలు
  • సోమవారం నేరుగా కోర్టులో లొంగిపోయేలా ప్రణాళిక
  • పది రోజులుగా నగరంలోనే క్యాంప్
  • హైదరాబాద్ నుంచి పోలీసు అధికారి పక్కా ప్రణాళిక
  •  
    విజయవాడ : కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసులో కీలక నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్ కోర్టులో లొంగుబాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కీలక నేతలు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. పోలీసులకు దొరికితే శ్రీకాంత్‌ను విచారణ చేసి వాస్తవాలు రాబడతారని భావించిన టీడీపీ ముఖ్య నేతలు, అతను కోర్టులో లొంగిపోయేలా వ్యూహాన్ని రచించారు.
     
    హైదరాబాద్‌లో ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఈ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా సాగితే సోమవారం కోర్టులో వెనిగళ్ల శ్రీకాంత్ లొంగిపోతాడని తెలుస్తోంది. వాస్తవానికి గత సోమవారమే లొంగిపోవాల్సి ఉండగా, నగరంలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు జరుగుతున్నందున తెలుగుదేశం నేతలంతా ఆ హడావుడిలో ఉన్నారు.

    దీంతో విజయవాడ సమీపంలోని ఉన్న ఒక నియోజకవర్గానికి చెందిన నాయకుడు లొంగుబాటు కార్యక్రమాన్ని మరో వారం వాయిదా వేయాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టులో లొంగిపోయిన అనంతరం అనారోగ్య కారణాలు చూపించి బెయిల్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
     
    నగరంలోనే శ్రీకాంత్... : గత పది రోజులుగా వెనిగళ్ల శ్రీకాంత్ నగరంలోనే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల పటమట లంకలో నివసిస్తున్న ఆయన నాయనమ్మ నాగేశ్వరమ్మ చనిపోగా అంత్యక్రియల్లో శ్రీకాంత్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియలకు శ్రీకాంత్ వచ్చాడని పోలీసులు తెలుసుకుని వెళ్లేలోగానే అతను చల్లగా జారుకున్నాడని చెబుతున్నారు. ముందుగా ఉన్న సమాచారం మేరకే పోలీ సులు ఆలస్యంగా వెళ్లారని ప్రచారం కూడా జరుగుతోంది.

    ఈ పది రోజుల నుంచి శ్రీకాంత్ తన బాకీదారుల గురించి వాకబు చేస్తున్నారు. కోర్టులో సరెండర్ అయి బయటకు వచ్చిన తరువాత వీరి వద్ద నుంచి బకాయిలు ఏ విధంగా రాబట్టాలనే అంశంపై తెలుగుదేశం నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం.  ఏదైనా తమ విషయాలను బయటకు రానీయకుండా శ్రీకాంత్‌ను కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసు నుంచి బయటకు తెచ్చేందుకు టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు