దండాలు..దండాలు..పోలేరమ్మ తల్లో..

21 Sep, 2016 01:31 IST|Sakshi
దండాలు..దండాలు..పోలేరమ్మ తల్లో..
 
  • అమ్మవారి నిలుపు నేడు
  • లక్షలాదిగా రానున్న భక్తులు 
  • మడిభిక్షాలకు చిన్నారులు సన్నద్ధం
  • నేటి నుంచి భక్తులతోనిండనున్న వెంకటగిరి
వెంకటగిరి:బంధాలు, అనుబంధాల కలయికకు వేదికైన వెంకటగిరి జాతరలో ప్రధాన ఘట్టానికి రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం నుంచి అసలు సందడి మొదలు కానుంది. అమ్మవారి విగ్రహం తయారీ పనులు ఉదయం నుంచే ఊపందుకోనున్నాయి. మిరాసీదారులు (కుమ్మరులు) వెంకటగిరి చెరువు నుంచి పుట్టమట్టిని, నాయుడుపేట నుంచి ప్రత్యేకంగా ఇసుక తీసుకొచ్చి విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు మంగళవారమే ప్రారంభమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తయారీ ప్రారంభించి రాత్రి 7 గంటలకు పూర్తి చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 10 గంటలకు అమ్మవారిపై వస్త్రం కప్పి మెట్టినిల్లయిన జీనుగులవారివీధిలోని చాకలి ఇంటికి ఊరేగింపుగా తీసుకెళతారు. 
 
పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండీ.. 
బుధవారం తెల్లవారే సరికి పట్టణంలో చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి చిన్నపాటి ఎదురు బుట్టకు పసుపు, కుంకుమ వేప ఆకులతో అలంకరించి ఇంటింటికి వెళ్లి మడిభిక్షాలు ప్రారంభిస్తారు. పోలేరమ్మకు మడిభిక్షం పెట్టండి..పోతురాజులకు టెంకాయ కోట్టండి.. పగలకపోతే మా నెత్తిన కొట్టండి.. అంటూ పాడుతూ మడిభిక్షం కోసం ఇంటింటికీ తిరుగుతారు. దీంతో పట్టణంలో జాతర సందడి మరింత జోరందుకుంటుంది. పలువురు భక్తులు తమ పిల్లలతో మడిభిక్షం ఎత్తిస్తామని పోలేరమ్మకు మొక్కుకుంటారు. అందులో భాగంగానే తమ పిల్లలను ఇంటింటికి పంపి వారు సేకరించిన బియ్యం, నగదును ఆసాదులకు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. అంతేగాక బుధవారం ఉదయం ప్రతి ఇంటిలో అంబళ్లు చేసి భక్తులకు పంచిపెడుతారు. మధ్యాహ్నం ఇంట్లో అమ్మవారిని పసుపుతో తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
 
గాలిగంగులతో శక్తిస్వరూపం..
గాలి గంగులు అనగా గంపలో పిండిదీపం పెట్టి గంపలకు పసుపు కుంకుమ వేప ఆకులతో అలకరించి అమ్మవారిని రమ్మని ఆహ్వానిస్తారు. ఈ తంతు పట్టణంలో కాంపాళెంలో జరుగుతుంది. గాలిరూపంలో చేరిన అమ్మవారిని అప్పటికే జీనుగులవారివీధిలోని మెట్టినిల్లు అయిన చాకలిఇంటికి చేరిన పోలేరమ్మ విగ్రహంలోకి ఆసాదులు ఆ శక్తిని ప్రవేశింపజేస్తారు. అప్పడు అమ్మవారికి పసుపు, కుంకుమ, సారెలు సమర్పిస్తారు. కళ్లు, బొట్టు పెడతారు. అనంతరం కోడిపుంజును అమ్మవారికి దిష్టితీసి కోసి రక్తంతో దిష్టిచుక్కను పెడతారు. అప్పుడు అమ్మవారు పరిపూర్ణశక్తి స్వరూపిణిగా మారుతారని భక్తుల విశ్వాçÜం. అక్కడే భక్తుల దర్శనార్ధం అమ్మవారిని ఉంచి ప్రత్యేకంగా పూలతో అలకరించిన రథంపై కొలువుదీర్చుతారు. తర్వాత పాతకోట మీదుగా పోలేరమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటుచేసే ప్రత్యేక వేపాకుల మండపంలో నిలుపు చేస్తారు. గురువారం తెల్లవారుజాము నుంచి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు లక్షలాది మంది రానుండటంతో వెంకటగిరి జనసంద్రంగా మారనుంది. ప్రతి ఇంటా బంధుమిత్రుల కోలాహలం నెలకొననుంది.  
మరిన్ని వార్తలు