‘వెన్నపూస’ గెలుపే ధ్యేయం

25 Nov, 2016 22:48 IST|Sakshi
‘వెన్నపూస’ గెలుపే ధ్యేయం
  •  ఓటు నమోదును వేగవంతం
  • వైఎస్సార్‌ సీపీ యువజన నాయకుడు ఆలూరు సాంబశివారెడ్డి
  • అనంతపురం రూరల్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డిని గెలిపించడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వెన్నపూస రవీంద్రారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 8 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదును పొడిగించిన నేపథ్యంలో యువత చురుగ్గా పాల్గొని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. అలాగే చంద్రబాబు పాలనపై యువతను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం.. లేదంటే నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చిన ఆయన అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతను రోడ్లపాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాల కోసం యువత డిగ్రీలు చేతబట్టుకుని ఇతర రాష్ట్రాలకు పరుగులు తీయాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌లా మారి ఉండేదని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన పాపాన పోలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ఉద్యోగాలు రావని, కేవలం అ«ధికార పార్టీ నాయకుల జేబులు మాత్రమే నిండుతాయని చెప్పారు. అమరావతికెళ్లి అనంతపురంలో కరువును జయించామని, ఇక్కడికొచ్చి పట్టిసీమతో రాయలసీమను సస్యశామలం చేస్తుంటే ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేవలం యువతనే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నాయకుడు ఆకుల రాఘవేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు