జీఓ 97ను రద్దు చేయాల్సిందే

14 May, 2016 14:07 IST|Sakshi

ప్రొద్దుటూరు: ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 97ను రద్దు చేయాల్సిందేనని వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పశువైద్య విద్యార్థులకు శరాఘాతంగా మారిన ఆ జీఓను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు శుక్రవారం కళాశాల ముందు ధర్నా చేశారు. ధర్నా ఐదవ రోజుకు చేరినా  ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అధ్యాపకులను బయటకు పంపించి కళాశాలకు తాళాలు వేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు.

ఆయన శుక్రవారం ధర్నాను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీఓ వలన పశు వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంపై త్వరలో విద్యార్థుల యూనియన్ ప్రతినిధులతో కలిసి తమ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఖర్చులకు గాను అసోసియేషన్ తరపున రూ.10 వేలు నగదు అందించారు.

తాళ్లమాపురం పశువైద్యాధికారి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఈ జీఓ విడుదల చేయడం చాలా బాధాకరమన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలాగే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కోశాధికారి ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, వెటర్నరీ డాక్టర్లు లక్ష్మినారాయణరెడ్డి, ఫణీంద్రారెడ్డి, మాధవ ఓబుళరెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గంగాసురేష్, పి.అంకుశం, ఏరియా కార్యదర్శి నాగరాజు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.
 

మరిన్ని వార్తలు