మూగజీవాలకు అందని వైద్యం

25 Sep, 2016 18:13 IST|Sakshi
మారేపల్లిలో సాయంత్రం వేళ మూసివున్న పశువైద్యకేంద్రం(ఫైల్‌)

సిబ్బంది కొరత.. ఇబ్బందుల్లో రైతన్నలు

కొండాపూర్‌: మూగజీవాలకు వైద్య సేవలు కరువయ్యాయి. దీంతో పశు యజమానులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలకు గానూ మారేపల్లి, కొండాపూర్, గొల్లపల్లి గ్రామాల్లో మాత్రమే పశు వైద్యశాలలున్నాయి. మండలంలో ఆవులు 4,230, ఎడ్లు 2,531 ,గేదేలు 3,804, మేకలు 8,321, గొర్రెలు 4,231 ఉన్నాయి.

పశువైద్యశాలలు  ఉన్నప్పటికీ, కొండాపూర్, గొల్లపల్లి, మారేపల్లిలోని పశువైద్యశాలల్లో  వైద్యులే లేరు. గొల్లపల్లిలోని వైద్యురాలు  పుల్‌కల్‌ మండలానికి డిప్యూటేషన్‌పై వెళ్లి సుమారు రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు కేవలం అటెండరే  అక్కడ అరకొర వైద్యం అందిస్తున్నారు.కొండాపూర్‌లోని డాక్టర్‌ కూడా   మొబైల్‌ వ్యానులో డిప్యుటేషన్‌పై వెళ్లారు. ప్రస్తుతం కేవలం మూడు వైద్యశాలలకు కలిపి ఒక్క వైద్యుడే అందుబాటులో ఉన్నారు.

మారేపల్లిలో లైవ్‌స్టాక్‌ ఆఫీసర్‌ ఉద్యోగ విరమణ పొంది ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు ఆయన స్థానంలో ఎవరూ రాలేదు. ప్రసుతతం  కొండాపూర్‌లోని లైవ్‌స్టాక్‌ ఆఫీసరే మారేపల్లికి ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.దీంతో గ్రామాల్లోని పశువులకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని చెప్పవచ్చు. అసలే వర్షాకాలం కావడంతో పశువులు నిత్యం అనారోగ్యాలకు గురై మృత్యువాత పడిన సంఘటనలు  చాలానే ఉన్నాయి.

దీనికి తోడు ఉద్యోగుల పనితీరు సైతం రైతులకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది.ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 3  నుండి 5 గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన వైద్యసిబ్బంది కేవలం ఉదయం 9 రావడం 12 గంటలకే వెళ్ళిపోవడంతో ఏమాత్రం ప్రజలకు అందుబాటులో వుండడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా సిబ్బందిని నియమించి పశువులకు మెరుగైన వైద్యం అందించాలనీ రైతన్నలు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు