స్థలం అడిగిన పాపానికి!

26 Jul, 2016 21:12 IST|Sakshi
స్థలం అడిగిన పాపానికి!
ప్రత్తిపాడు: ‘నివేశన స్థలం అడగడమే మేం చేసిన పాపమా. ముఖ్యమంత్రిని కలిసి సమస్యను విన్నవించుకోవాలనుకోవడమే మేం చేసిన నేరమా.. ఏం తప్పు చేశాడని మావాడిని పోలిస్‌ స్టేషనుకు తీసుకెళ్లారు. మీరూ వద్దూ.. మీ స్థలం వద్దు.. మా పిల్లాడిని మాకు అప్పగించండి..’ అంటూ కోయవారిపాలెం ఎస్టీ మహిళలు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. వివరాలలోనికి వెళితే ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో రోడ్డు వెంబడి కొందరు ఎస్టీ వాసులు పట్టాలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నివేశన స్థలాలు కావాలంటూ గతంలో అనేకమార్లు తహశీల్దార్‌లకు, ఆర్డీవోలకు, కలెక్టర్‌లకు, మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల 21వ తేదీన వారంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు సీఎం కార్యాలయానికి వెళ్లారు. 
 
పోలీస్‌ స్టేషనుకు పిలిపించడంతో.. 
సీఎం కార్యాలయానికి వెళ్లినందుకు బాణావత్‌ కరుణకుమార్‌ అనే యువకుడిని మంగళవారం ఉదయం పోలీసులు చేబ్రోలు పోలీస్‌స్టేషనుకు తీసుకువెళ్లడం, సాయంత్రం చేబ్రోలు సీఐ జి రవికుమార్‌ కోయవారిపాలెంకు వచ్చి ఎస్టీలతో మాట్లాడటంతో కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. అసలు కరుణకుమార్‌ ఏం నేరం చేశాడని పోలీస్‌ స్టేషనుకు తీసుకువెళ్లారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. మాకు చదువులేదు కదా అని కరుణకుమార్‌ను సాయం కోసం తోడు తీసుకువెళ్లామని, తోడు వచ్చినందుకు ఆ కుర్రోడిని పోలీసులు స్టేషనుకు తీసుకువెళ్లడం ఏంటంటూ మహిళలు మండిపడుతున్నారు. ఆ కుర్రాడి బదులు మమ్మల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టండి అంటూ ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లివచ్చిన తరువాత మంత్రి రావెలను కలిసి తమ గోడును వెల్లబోసుకునేందుకు మంత్రి రావెల కార్యాలయానికి వెళ్లామని, కార్యాలయంలోనికి రానివ్వకుండా, మంత్రిని కలవనివ్వకుండా మంత్రి అనుచరులు మమ్మల్ని కార్యాలయం నుంచి బయటకు తరిమేశారని మహిళలు ఆరోపిస్తున్నారు.
మరిన్ని వార్తలు