సర్కారు వ్యూహం..బెడిసి కొట్టింది!

5 Jul, 2016 08:20 IST|Sakshi

పీఠాధిపతులు, మఠాధిపతుల సభ భగ్నానికి యత్నం
మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీసు  అనుమతి ఇవ్వని వైనం
వర్షాన్ని సైతం లెక్కచేయక తరలివచ్చిన  అభిమానులు
మంత్రి కామినేనికి వ్యతిరేకంగా నినాదాల హోరు
ఎంపీ కేశినేని క్షమాపణ చెప్పాలని, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను సస్పెండ్  చేయాలని డిమాండ్
దేవాలయాలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ

 

విజయవాడ : నగరంలో పది రోజులుగా జరిగిన దేవాలయాల విధ్వంసానికి వ్యతిరేకంగా పీఠాధిపతులు, మఠాధిపతులు సోమవారం నిర్వహించిన సభను భగ్నం చేయడానికి ప్రభుత్వం చేసిన యత్నం బెడిసి కొట్టింది. దేవాలయాల కూల్చివేతపై ఆగ్రహంతో ఉన్న నగరవాసులు ఈ సభకు తరలివచ్చారు. వర్షాన్ని లెక్కచేయక స్వామీజీల ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు. దేవాలయాలను పరిరక్షిస్తామంటూ శివస్వామి చేయించిన ప్రతిజ్ఞను ప్రతి ఒక్కరూ చేశారు.
 
అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు...
 సమావేశం నిర్వహించుకోవడానికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి నిర్వాహకులు రెండు రోజులుగా అనుమతి కోరుతున్నా పోలీసులు ఇవ్వలేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాట్లను పరిశీలించి వెళ్లిన తరువాత.. సభ నిర్వహించుకోవడానికి రెండు గంటల సమయంలో అనుమతి ఇచ్చారు. దీంతో సమితి నిర్వాహకులు అప్పటికప్పుడు వేదికను ఏర్పాటు చేసి  మూడున్నర సమయానికి పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈలోగా సభికులు కూడా తరలిరావడంతో సమావేశం ప్రారంభమై యథాతథంగా సాగింది. పీఠాధిపతులతో నిర్వహించాలనుకున్న ర్యాలీని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. దానికి అనుమతివ్వలేదు. సమావేశం వద్దకు వచ్చేవారి వాహనాలను పలుచోట్ల పోలీసులు నిలుపుదల చేశారు. దీంతో వాహనాలను అక్కడే పార్కింగ్ చేసి కాలినడకన వేదిక వద్దకు చేరుకున్నారు.
 

మంత్రి కామినేనికి వ్యతిరేకంగా  నినాదాల హోరు...
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వేదిక వద్దకు వస్తుంటే గో బ్యాక్ అంటూ కొంతమంది నినాదాలు చేశారు. ‘విగ్రహాలు కూల్చివేస్తున్నప్పుడు ఎక్కడున్నావ్.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావ్..’ అంటూ నిలదీశారు. వేదిక పైకి వచ్చిన కామినేని శ్రీనివాస్ కాసేపు కూర్చుని తన ప్రసంగం పూర్తికాగానే వెనుక నుంచి చల్లగా జారుకున్నారు. సమావేశం జరుగుతున్నంతసేపూ ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు మార్మోగాయి. పీఠాధిపతులు ప్రసంగాలు ప్రారంభించిన తరువాత మాత్రం అందరూ శ్రద్ధగా విన్నారు. దేవాలయాల కూల్చివేతలో కీలకపాత్ర పోషించిన ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ బాబు.ఎలకు వ్యతిరేకంగా స్వామీజీలు మాట్లాడినప్పుడు సభలో పాల్గొన్నవారు చప్పట్లు కొట్టి హర్షం తెలియచేశారు. ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాలని, కలెక్టర్ అహ్మద్‌బాబును, కమిషనర్ వీరపాండియన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సమావేశంలో అన్ని విషయాలూ చర్చించుకుందామని నిర్వాహకులు వారికి సర్దిచెప్పి శాంతింపజేశారు.
 

ఇక ఏ దేవాలయం జోలికి వచ్చినా...
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల సమాచారం తమకు పంపించాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధి కొనగళ్ల విద్యాధరరావు సూచించారు. ఆయా దేవాలయాలను ప్రభుత్వం, అధికారులు తొలగించాలని ప్రయత్నిస్తే తాము అడ్డుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల ప్రతినిధులందరినీ సంఘటితం చేసేందుకు తమ సమితి వేదికవుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి దేవాలయాలను పరిరక్షిస్తామని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను అడ్డుకుంటామని, గోవులను రక్షించే విషయంలో ఏ విధమైన అవాంతరాలు ఎదురైనా కలిసికట్టుగా ఎదిరిస్తామని సభికులతో ప్రతిజ్ఞ చేయించారు.
 
 

మరిన్ని వార్తలు