విశ్వస్థాయిలో విద్యానికేతన్‌ విద్యార్థి ప్రతిభ

23 Jul, 2016 21:09 IST|Sakshi
చంద్రస్వరతీష్‌ను అభినందిస్తున్న మోహన్‌బాబు
 
– వారం రోజుల్లో పది యాప్‌ల రూపకల్పన
తిరుపతి ఎడ్యుకేషన్‌ :
తిరుపతి సమీపంలోని విద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌సి) నాల్గవ సంవత్సర  విద్యార్థి అద్దంకి చంద్రస్వరతీష్‌ విశ్వస్థాయిలో ప్రతిభ కనబరచాడు. వారం రోజుల్లో 10ఆండ్రాయిడ్‌ యాప్‌లను రూపొందించి ఈ ఘనత సాధించాడు. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఆండ్రాయిడ్‌ బేసిక్స్‌ పోటీ పరీక్షల్లో ఇతను 61వ స్థానంలో నిలిచాడు.
 
ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన 100మందిలో 15మంది మాత్రమే భారతీయులున్నారు. వీరిలో చంద్రసరస్వరతీష్‌ ఒకడు. ఇతనికి గూగుల్‌ సంస్థ ఒక ఏడాదికి రూ.1లక్ష 20 వేలు వరకు ఉపకార వేతనాన్ని అందించనుంది. దీంతో పాటు ఆండ్రాయిడ్‌ నానో డిగ్రీ కోర్సుపై  వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్లో శిక్షణ కూడా ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఆ కళాశాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యానికేతన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎం.మోహన్‌బాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా  పని చేస్తున్న డాక్టర్‌ జ్యోతిబాబు కుమారుడు చంద్రస్వరతీష్‌ ఈ ఘనత సాధించడం తమ విద్యాసంస్థలకే గర్వకారణమని తెలిపారు. తన మేధాశక్తిని నిరూపించుకున్నాడని, ఇటువంటి సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలకు విద్యానికేతన్‌ వేదికగా నిలుస్తుందని తెలిపారు.
 
కార్యక్రమంలో విద్యానికేతన్‌ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్‌ గోపాలరావు, ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ డీవీఎస్‌.భగవానులు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పిసి.కృష్ణమాచారి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.డిల్లీబాబు, ఫైనాన్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌  డైరెక్టర్‌ బి.రవిశేఖర్, సీవోవో డాక్టర్‌ ఐ.సుదర్శన్‌కుమార్, సీఏవో కె.తులసీనాయుడు తదితరులు విద్యార్థిని అభినందించారు. 
 
 
 
మరిన్ని వార్తలు